Praja Kshetram
జాతీయం

ఏపీ, బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తారా?

ఏపీ, బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తారా?

 

 

*-విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేస్తారా?*

*-కులగణను దేశవ్యాప్తంగా చేపడుతారా?*

*-బీజేపీకి కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ప్రశ్నాస్త్రాలు*l

 

న్యూఢిల్లీ జూన్ 06 (ప్రజాక్షేత్రం): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన టీడీపీ, జేడీయూ అనేక ఏండ్లుగా డిమాండ్‌ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌లకు ప్రత్యేక ప్రతిపత్తిని బీజేపీ నెరవేరుస్తుందా? అని కాంగ్రెస్‌ పార్టీ గురువారం ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశారు. కాబోయే కొత్త ప్రధానికి ఆయన అందులో నాలుగు ప్రశ్నలను సంధించారు.

 

2014 ఏప్రిల్‌ 30న పవిత్రమైన తిరుపతి నగరంలో మీరు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నెరవేరుస్తారా? విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను మీరు ఇప్పుడు నిలిపివేస్తారా? బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా మీ 2014 నాటి హామీని, మీ మిత్రుడు నితీశ్‌కుమార్‌ పదేళ్ల డిమాండ్‌ను నెరవేరుస్తారా? బీహార్‌లో మాదిరిగానే దేశవ్యాప్తంగా కులగణనను నిర్వహిస్తారా?’ అని జైరాం రమేశ్‌ ప్రశ్నించారు.

 

 

కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఢిల్లీలో బీజేపీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఈ ప్రశ్నలు సంధించింది. బీజీపీ ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సొంతంగా దక్కించుకోలేని నేపథ్యంలో తెలుగుదేశం, జేడీయూ నరేంద్రమోదీ మూడో ప్రభుత్వంలో కీలకంగా మారారు. తాము మద్దతు ఇస్తున్నందుకు గాను స్పీకర్‌ పోస్టు సహా పలు కీలకమైన మంత్రి పదవులపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ పట్టుపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

కేంద్ర క్యాబినెట్‌లో ఆర్థిక శాఖ సహా నాలుగు కీలక పోర్టుఫోలియోలను టీడీపీ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అమరావతిని అభివృద్ధి చేయడంతోపాటు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పట్టుపడుతున్నట్టు తెలుస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలోని 25 సీట్లకు గాను టీడీపీ నేతృత్వంలోని కూటమి 21 స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

 

 

ఇదిలా ఉంటే.. జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌కు 12 స్థానాలు లభించాయి. ఆయన రైల్వే, గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖలను కోరుతున్నట్టు తెలుస్తున్నది. వీటితోపాటు మూడు సహాయ మంత్రి పదవులను కూడా అడుగుతున్నారని సమాచారం. జూన్‌ 9వ తేదీన ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈలోపు ప్రత్యేకించి క్యాబినెట్‌ కూర్పుపై టీడీపీ, జేడీయూల డిమాండ్లు ఏ మేరకు నెరవేరుతాయనే ఆసక్తి రెండు రాష్ట్రాల ప్రజల్లో నెలకొని ఉన్నది.

Related posts