ఆస్తి కోసం గెంటేసిన కూతుళ్లు.. మనోవేదన తండ్రి మృతి
నాగర్‌కర్నూల్ జూన్ 07 (ప్రజాక్షేత్రం): ఆస్తి కోసం కన్న తండ్రినే కాదనుకున్నారు ఆ కూతుళ్లు! అల్లారుముద్దుగా పెంచి.. మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేస్తే.. జన్మనిచ్చినవాడినే రోడ్డున పడేశారు! ఈ పరిణామంతో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి హఠాన్మరణం చెందాడు. ఈ దారుణమైన ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని బలరాంనగర్‌కు చెందిన శ్రీహరికి నలుగురు కుమార్తెలు. ఉన్నంతలో నలుగురి పెళ్లిళ్లు ఘనంగా జరిపించాడు. ఎవరికి వాళ్లు అంతా సంతోషంగా జీవిస్తున్నారు. అయితే కొంతకాలం కిందట శ్రీహరి అస్వస్థతకు గురయ్యాడు. కిడ్నీ వ్యాధి కారణంగా హైదరాబాద్ వచ్చి చికిత్స తీసుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కల్వకుర్తికి వచ్చాడు. ఈ క్రమంలోనే నలుగురు కుమార్తెలు శ్రీహరి దగ్గరకు వచ్చారు. ఆయన పేరు మీద ఉన్న ఫ్లాట్‌ను తమ పేరు మీదకు మార్చాలని డిమాండ్ చేశారు. కానీ ఈ అవసాన దశలో ఆ ఫ్లాటే తమకు ఆధారం అని భావించిన శ్రీహరి.. ఫ్లాట్‌ను కూతుళ్ల పేరు మీద రాసేందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహనికి గురైన కుమార్తెలు తండ్రిని తీసుకొచ్చి పట్టణంలోని సాయిబాలాజీ ఫంక్షన్ హాలు వద్ద వదిలేసి వెళ్లిపోయారు. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటారేమోనని ఆశపడితే.. కన్న కూతుళ్లే తనను అలా ఒంటరిగా వదిలేయడంతో శ్రీహరి ఎంతగానో కుమిలిపోయాడు. మనోవేదనతో మరింత అనారోగ్యానికి గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం తన తుది శ్వాసను విడిచాడు.