ఢిల్లీ వెళ్లి మోదీని కలుస్తా… వీహెచ్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ జూన్ 07 (ప్రజాక్షేత్రం): ఢిల్లీకి వెళ్లి మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి కులగణన చేయాలని డిమాండ్ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ గెలవడంతో మరోసారి మోదీకి ప్రజలు అవకాశం ఇచ్చారని.. ఓటర్ల తీర్పును గౌరవిస్తామన్నారు. మోదీ ఓబీసీ ప్రధాని కానీ బడుగు బలహీనర్గాల సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారని గుర్తుచేశారు. రిజర్వేషన్‌లో 50 శాతం సిలింగ్ ఎత్తివేస్తామని అన్నారన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి కీ రోల్‌లో జేడీయూ అధినేత నితీష్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పారు. మోదీ వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. బీహార్‌లో నితీష్ కులగణన చేస్తే 67 శాతం రిజర్వేషన్ బీసీలకు వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ చేసిన ఆలోచనను మోదీ కొనసాగించాలని కోరారు. ఓబీసీ కన్వీనర్‌గా తాను ఉండి రిజర్వేషన్ పెంచాలని మోదీని గతంలో కోరానని గుర్తుచేశారు. ఐఐటీలో కూడా రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని.. బిల్ పాస్ అయిందని తెలిపారు. మాండల్ కమిషన్ వచ్చింది కానీ బీసీలు చట్ట సభల్లో డబుల్ డిజిట్ కూడా దాటడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నితీష్, చంద్రబాబులు కూడా అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని మోదీని కోరాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్లు అవుతున్న బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. తెలంగాణలో కులగణన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే.. బీసీలకు మేలు జరుగుతుందని.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కొంత ఆలస్యమైన కులగణన తర్వాతే రాష్ట్రంలో ఎన్నికలు పెట్టాలని కోరారు. అసెంబ్లీలో కులగణన బిల్లు పాస్ చేయించిన వెంటనే కులగణనను అమల్లోకి తీసుకురావాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు మోదీకి వేంకటేశ్వర స్వామి విగ్రహం అందజేశారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని మోదీ ఇచ్చారని.. దానిని పట్టుబట్టి అమలు చేయించాలని కోరారు. మూడోసారి ఓబీసీ ప్రధానిగా మోదీ అవుతున్నారు కాబట్టి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. సెన్సెక్స్ మీద ప్రభావం చూపాయని హనుమంతరావు పేర్కొన్నారు.