Praja Kshetram
జాతీయం

ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము

ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించిన రాష్ట్రపతి ముర్ము

 

 

న్యూడిల్లీ, జూన్ 07 (ప్రజాక్షేత్రం): కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. శుక్రవారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోదీ కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీని ముర్ము కోరారు. అయితే జూన్ 9వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎంపీలతో కేంద్రమంత్రులుగా రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

 

మరోవైపు శుక్రవారం ఉదయం పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల ఎంపీలు సమావేశమయ్యారు. ఆ క్రమంలో తమ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని వారంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే మోదీ కేబినెట్‌లో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి రామ్ విలాస్ పాశ్వాన్, శివసేన షిండే పార్టీలకు చెందిన ఎంపీలకు చోటు దక్కే అవకాశం ఉంది. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీకి కేవలం 240 స్థానాలే వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 272 స్థానాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భాగస్వామ్య పక్షాలను కలుపుకోవడంతో.. ఎన్డీయే కూటమికి 275 సీట్లు వచ్చినట్లు అయింది.

Related posts