Praja Kshetram
తెలంగాణ

జ్యుడీషియల్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు.. మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్

జ్యుడీషియల్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు.. మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్

 

 

జయశంకర్ భూపాలపల్లి జూన్ 07 (ప్రజాక్షేత్రం): కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నిన్నటి వరకూ పార్లమెంట్ ఎన్నికలతో కోడ్ ఉండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ సాధ్యం కాలేదని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన మరుసటి రోజే కాళేశ్వరం బ్యారేజ్ పనులను పరిశీలించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిరూపయోగంగా ఉందని.. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 90వేల కోట్లకు అదనంగా వడ్డీ చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇండియాలోనే అత్యున్నత సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డి ఎస్ ఎ) నిపుణుల కమిటీ ఈ పనులను పర్యవేక్షిస్తుందని అన్నారు.కాళేశ్వరం డ్యామ్ పునరుద్ధరణ సాధ్యమా కాదా అని ఎన్ డి ఎస్ ఎ ను అడిగామన్నారు. ఆ కమిటీ అధికారులు బ్యారేజ్‌లపై కొన్ని సూచనలు చేశారని తెలిపారు. మూడు బ్యారేజీల గేట్లు ఎత్తిపెట్టాలని ఎన్ డి ఎస్ ఎ చెప్పిందన్నారు. వర్షాకాలంలో వరదలు రాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారని అన్నారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం నీళ్లు స్టోరేజీ చేయొచ్చని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని..ఎన్ డి ఎస్ ఎ కమిటీ మాత్రం అలా చేస్తే ప్రమాదమని చెప్పారన్నారు. బ్యారేజ్ మరమ్మతు పనులు వేగవంతం చేయాలని నవయుగ కంపెనీ ప్రతినిధులను మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. సుందిళ్లలో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా గతంలో ఉన్న ఇంజనీరింగ్ అధికారులను తొలగించామని తెలిపారు. జ్యుడీషియల్ విచారణ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టి నీళ్లలో పోశారని మండిపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి కట్టి ఉంటే ఇంతకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టకు నీళ్లు వచ్చేవని చెప్పుకొచ్చారు. తుమ్మిడిహట్టి ప్రతిపాదనలో ఏడాదికి రూ. వెయ్యి కోట్ల వరకు విద్యుత్ అదనంగా ఖర్చు అయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రూ. 10 వేల కోట్లు ఖర్చు వృథా అయిందని చెప్పారు. కేసీఆర్ ఇన్ని లక్షల కోట్లు నాశనం చేశారని ధ్వజమెత్తారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫలితాలు చూసిన తర్వాత కేసీఆర్ గురించి మాట్లాడుకోడం వేస్ట్ అని ఎద్దేవా చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ చేపట్టడతామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వాలు అబద్ధాలు చెప్పాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

*బుంగ పడింది వాస్తవమే: ఈ ఎన్సీ అధికారి అనీల్*

 

మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్‌లో బుంగ పడింది వాస్తవమేనని ఈ ఎన్సీ అధికారి అనీల్ తెలిపారు. పీయర్స్ కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే బుంగ పడిందని.. బుంగ ఫిల్లింగ్ చేస్తున్నాయని అనీల్ చెప్పారు.

Related posts