కొనసాగుతున్న మీడియా మొఘల్ అంతిమయాత్ర.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్ జూన్ 09 (ప్రజాక్షేత్రం): ఈనాడు గ్రూప్ చైర్మన్, మీడియా మొఘల్ రామోజీ రావు అంతిమయాత్ర ప్రారంభమైంది. పోలీసులు అంతిమ గౌరవం తర్వాత రామోజీ నివాసం నుంచి ఫిల్మ్‌సిటీలోని స్మృతివనం వరకు అంతిమయాత్ర కొనసాగుతున్నది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫుణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు కడసారి నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వరారావు పాల్గొన్నారు. రామోజీరావును కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
రామోజీ రావు అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. జూన్ 5న తీవ్ర గుండెపోటుతో హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీలో చేరారని, హార్ట్ ఫెయిల్యూర్‌తో పాటు లోబీపీతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటిలేటర్‌పై ఉంచి ఐఏబీపీ సా యంతో ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు యాంజియోగ్రామ్ టెస్ట్‌చేసి, స్టంట్వేశామని, అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ బృందాలు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. కాగా, రామోజీరావు తాను బతికుండగానే ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి శివారులో ప్రత్యేకంగా స్మృతివనం నిర్మించుకున్నారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
Views: 13