చినుకు పడితే చిత్తడే
-పేరు గొప్ప ఊరు దిబ్బలా మద్దూర్ పట్టణ పరిస్థితి మారింది.
-పట్టణంలోని అంతర్గ రోడ్లు అధ్వానంగా మారాయి.
-అస్తవ్యస్తమైన రహదారులతో ప్రయాణికుల ఇక్కట్లు
మద్దూర్, జూన్ 11 (ప్రజాక్షేత్రం): పేరు గొప్ప ఊరు దిబ్బలా మద్దూర్ పట్టణ పరిస్థితి మారింది. పట్టణంలోని అంతర్గ రోడ్లు అధ్వానంగా మారాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన పలు వీధుల అంతర్గత రోడ్లు అభివృద్ధికి నోచుకోక పోగా అందులో మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణంతో మరింతగా అధ్వానంగా మారాయి. పైప్‌లైన్ నిర్మాణం చేపట్టి వదిలేయడంతో రోడ్డుపై కంకర తేలి పలు చోట్ల గుంతలమయంగా మారింది. దీంతో నివాస గృహాల నుంచి మురికి నీరు రోడ్డుపై పారడంతో చిత్తడిగా మారడంతో పాటు వర్షపు నీరు నిలిచి రాకపోకలక ఇబ్బందిగా మారుతోందని పట్టణ వాసులు వాపోతున్నారు. ముఖ్యంగా పాత బస్టాండ్ నుంచి గ్రామ సచివాలయానికి వెళ్లే దారి మరింత అధ్వానంగా మారింది. వీటితో పాటు అమర్‌గడ్డ, ఎస్సీ వాడ, పాత బస్టాండ్ బొడ్రాయి, ఐబీ రోడ్డు తదితర రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. వీటిపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోక పోవడంతో పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టణ అంతర్గత రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
కృష్ణ : రెండు రోజులుగా కురిసిన వర్షానికి కృష్ణ మండలంతో పాటు అడవిఖానాపూర్, సుకూరు లింగంపల్లి గ్రామ మట్టి రోడ్లు గుంతలమయమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో రాత్రి వేళ ఈ రహదారుల వెంట వెళ్లాలంటే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాలన్న ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని కోరుతున్నారు.