Praja Kshetram
జాతీయంసినిమా న్యూస్

కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌

కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌

 

న్యూఢిల్లీ జూన్ 13 (ప్రజాక్షేత్రం): కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజల మధ్య ఇరువురు బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి రెండోసారి ఎంపీగా విజయం సాధించిన కిషన్‌ రెడ్డి.. ప్రధాని మోదీ క్యాబినెట్‌లో మరోసారి అవకాశం దక్కించుకున్నారు. ఆయనకు బొగ్గు, గనులశాఖ బాధ్యతలను ప్రధాని అప్పగించారు. ఈనేపథ్యంలో గురువారం ఉదయం తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, బాధ్యతలు చేపట్టారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో విద్యుత్ లేకుండా ఏ పనీ కాదని కిషన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయం నుంచి ఐటీ పరిశ్రమ వరకు ప్రజల జీవితాలు కరెంట్‌తో పెనవేసుకుని ఉన్నాయని చెప్పారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని వెల్లడించారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నదని, కరెంటు కోతలు లేకుండా ఉండాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాలన్నారు. మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో దానిని తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామన్నారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామని వెల్లడించారు.

ఇక కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కూడా కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ సర్కార్‌లో అవకాశం దక్కింది. ఈ మేరకు తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు.

Related posts