Praja Kshetram
జాతీయం

యడియూరప్పపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

యడియూరప్పపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

 

కర్ణాటక జూన్ 13 (ప్రజాక్షేత్రం): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. పోక్సో కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో బెంగళూరు కోర్టు యడియూరప్పపై గురువారం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై రేపు విచారణ జరగనుంది. మరోవైపు ఈ కేసులో సీఐడీ బుధవారం యడియూరప్పకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.‌ 17 ఏళ్ల మైనర్‌ బాలికను లైంగికంగా వేధించినట్లు యడియూరప్పపై ఆరోపణలు వచ్చాయి. దీంతో మార్చిలో కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. త‌న బిడ్డను యడియూర‌ప్ప బ‌ల‌వంతంగా ఓ గ‌దిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యడియూర‌ప్పపై పోక్సో కేసు న‌మోదైంది. బాధితురాలి త‌ల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతూ ఇటీవ‌లే చ‌నిపోయారు. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలితో పాటు ఆమె త‌ల్లి వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు న‌మోదు చేశారు. ఇక ఈ కేసులో యడియూర‌ప్పను సీఐడీ ఎప్పుడైనా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని క‌ర్ణాట‌క హోం మంత్రి జి ప‌ర‌మేశ్వర గురువారం పేర్కొన్నారు. దీనిపై సీఐడీ నిర్ణయం తీసుకుంటుంద‌న్నారు. ప్రస్తుతం యడియూర‌ప్ప ఢిల్లీలో ఉండ‌డంతో జూన్ 17వ తేదీన సీఐడీ ముందు హాజ‌ర‌వుతాన‌ని పేర్కొన్నారు.

Related posts