మోదీ సర్కార్ నిర్వాకంతో అంధకారంలో 24 లక్షల మంది విద్యార్ధుల భవితవ్యం : ఖర్గే
ఢిల్లీ జూన్ 13 (ప్రజాక్షేత్రం): నీట్ పరీక్షలో జరిగిన అక్రమాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ నిర్వాకంతో నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్ధుల భవితవ్యం గందరగోళంగా మారిందని దుయ్యబట్టారు. నీట్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని, పేపర్ లీకేజ్ సహా పలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు ఒక్కటే సమస్య కాదని, ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, అవినీతి వంటి ఎన్నో లోటుపాట్లు, అవకతవకలు చోటుచేసుకున్నాయని ఖర్గే ఆరోపించారు. పరీక్షా కేంద్రాలు, కోచింగ్ కేంద్రాలు కుమ్మక్కయ్యాయని ఖర్గే అన్నారు. డబ్బులు చెల్లించి పేపర్ తీసుకునే గేమ్ నడిచిందని దుయ్యబట్టారు. నీట్ స్కామ్‌లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఈ కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.