తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
నల్గొండ జూన్ 14 (ప్రజాక్షేత్రం): రాబోయే నాలుగున్నరేళ్లలో తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పంప్ హౌస్, ప్రాజెక్టు రిజర్వాయర్‌ను పరిశీలించారు. ప్రైవేట్ స్కూళ్లను మూసివేసి.. ప్రభుత్వ పాఠశాలలన్నీ తెరుచుకోవాలనేది తమ ప్రభుత్వ నినాదమని అన్నారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో నేడు(శుక్రవారం) ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రికి పూర్ణ కుంభంతో అధికార యంత్రాంగం స్వాగతం పలికారు. బ్రాహ్మణ వెల్లంల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కను నాటి విద్యార్థులతో మంత్రి కోమటిరెడ్డి అక్షరాభ్యాసం చేయించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లయిందని.. అసలైన రాష్ట్రం డిసెంబర్ 3న తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే వచ్చిందని చెప్పారు. విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించిదని అన్నారు. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యా వ్యవస్థను పటిష్ట పరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. వచ్చే మూడేళ్లలో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని ఉద్ఘాటించారు. మాజీమంత్రి మల్లారెడ్డి అనురాగ్, గురునానక్ యూనివర్సిటీల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ పాఠశాలలోనే ఏడోతరగతి వరకు తాను చదివానని… తల్లిదండ్రుల తర్వాత పుట్టిన ఊరు చాలా గొప్పదని అన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. విద్యార్థులు పెద్దపెద్ద కలలు కని సాకారం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
అనంతరం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. వచ్చే నాలుగు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ప్రాజెక్ట్‌ను ప్రారంభించుకుందామని తెలిపారు. డిసెంబర్ లోపు ఈ ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపుతామని అన్నారు. ఇక్కడి చెరువు వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. నార్కట్‌పల్లి డిపోనకు మరో వారం రోజుల్లో 20 కొత్త బస్సులు రాబోతున్నాయని చెప్పారు. మూడు -నాలుగేళ్లలో మూసీ నదిని సుందరీకరిస్తామని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యారని విమర్శించారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, విద్య గురించి కేసీఆర్ తన పాలనలో ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. దక్షిణ తెలంగాణను కేసీఆర్ చిన్నచూపు చూశారని.. అందుకు నిదర్శనమే మొన్నటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.