Praja Kshetram
క్రైమ్ న్యూస్

ఉట్కూరులో వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై సీరియస్‌.. ఎస్సై సస్పెండ్‌

ఉట్కూరులో వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై సీరియస్‌.. ఎస్సై సస్పెండ్‌

 

 

 

నారాయణపేట జూన్ 14 (ప్రజాక్షేత్రం): భూవివాదం కారణంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో సంజీవ్‌ అనే వ్యక్తిని కొట్టి చంపిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. భౌతిక దాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే, అక్కడి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉట్కూరు ఎస్సై బిజ్జ శ్రీనివాసులును సస్పెండ్‌ చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమైనందున శ్రీనివాసులును సస్పెండ్‌ చేసినట్లుగా జిల్లా ఎస్పీ యోగేశ్‌ గౌతమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, భూ తగాదా కేసులో సంజీవ్‌పై దాడి చేసిన నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామానికి చెందిన సంజీవ్‌ అనే రైతు జీవనోపాధి కోసం గ్రామం విడిచి కుటుంబంతో సహా హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. ఇటీవల వర్షాలు కురవడంతో తనకు ఉన్న నాలుగు ఎకరాలను సాగు చేసేందుకు తాజాగా గ్రామానికి వెళ్లాడు. కాగా, అప్పటికే దాయాదులతో భూ తగాదాలు ఉండటంతో గ్రామానికి వచ్చిన సంజీవ్‌తో గొడవకు దిగారు. మాటామాట పెరగడంతో సంజీవ్‌పై దాయాదీలు కర్రలతో దాడికి దిగారు. సంజీవ్‌ భార్య, గ్రామస్థులు ఎంతగా అడ్డుకున్నప్పటికీ వినిపించుకోకుండా దారుణంగా చితకబాదారు. తీవ్రంగా గాయపడిన సంజీవ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, దాడి జరుగుతున్న సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డయల్‌ 100కి ఫోన్‌ చేసిన రెండు గంటల తర్వాత పోలీసులు ఘటనాస్థలికి వచ్చారని తెలిపారు. అదును చూసుకుని వాళ్లు సంజీవ్‌పై కర్రలతో దాడికి దిగారు.

Related posts