ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ
హైదరాబాద్ జూన్ 14 (ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సైదులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 3 నెలల వ్యవధితో జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల్లో, డయాలసిస్ టెక్నీషియన్ 4 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ (మల్కాజ్‌గిరి)శిక్షణ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు. 18నుంచి 35 సంవత్సరాల వయస్సున్న, పదో తరగతి చదివిన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. అర్హులు, ఆసక్తి ఉన్న యువత 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు 98485 81100, 90599 02355 నంబర్లలో సంప్రదించాలని, ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.