Praja Kshetram
పాలిటిక్స్

కేసీఆర్‌ తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. అద్దంకిల ఫైర్‌

కేసీఆర్‌ తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. అద్దంకిల ఫైర్‌

*-అరెస్టుకు భయపడే కమిషన్‌పై కేసీఆర్‌ గగ్గోలు*
*-చైనాలో చేసి ఉంటే ఉరి తీసేవారు*
*-కేసీఆర్‌ ప్రమేయంతోనే అన్ని శాఖల్లో స్కామ్‌లు*

 

 

హైదరాబాద్‌ జూన్ 16 (ప్రజాక్షేత్రం): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆరెస్‌ మధ్య కరెంటు సమస్యపై మాటలు మంటలు రేగుతున్నాయి. విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్‌ పవర్‌ ఫ్లాంట్ల నిర్మాణాలపై అవకతవకలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ నియమించగా, కమిషన్‌ విచారణను తప్పుబడుతూ మాజీ సీఎం కేసీఆర్‌ 12పేజీల లేఖ రాసి చైర్మన్‌ బాధ్యతల నుంచి నరసింహారెడ్డిని తప్పుకోమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ మాటలను తప్పుబడుతూ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు, సమర్ధిస్తూ బీఆరెస్‌ నేతలు మాటల యుద్దం సాగిస్తున్నారు.

ఆదివారం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ లేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పవర్ కమిషన్ విచారణకు కేసీఆర్ సహకరించకపోవడం అంటే ఆయన నేరాన్ని అంగీకరించినట్టేనని తేల్చేశారు. పవర్ కమిషన్ చైర్మన్‌ను కేసీఆర్ నేరుగా భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. న్యాయ వ్యవస్థను కేసీఆర్ కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ అని కొత్త నాటకానికి తెర తీస్తున్నారని మండిపడ్డారు. రామగుండంలో కాదని దామర చర్లలో విద్యుత్ ప్లాంట్ పెడతారా…? అని ధ్వజమెత్తారు. అక్కడ నెలకొల్పడంతో బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదా అని నిలదీశారు. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడ్డారని మండిపడ్డారు.

లేదంటే 3రూపాయలకే వచ్చే సోలార్ పవర్‌ గురించి ఎందుకు ఆలోచించలేదని నిలదీశారు. గత పదేళ్ల హయాంలో కేసీఆర్ చేయని తప్పు లేదని.. ఇవే తప్పులు చైనాలో చేసి ఉంటే ఉరి తీసేవారని విమర్శించారు. వివిధ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేసిన ఆలోచిన తప్పయ్యిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.. దాంతో రూ.40 వేల కోట్ల ఆర్థిక భారం పడిందని వివరించారు. నరహింహారెడ్డి నివేదిక ఏం ఇస్తారోననే భయం కేసీఆర్‌లో నెలకొందని పేర్కొన్నారు. అందుకే ఏకపక్షంగా వాదిస్తున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల గురించి కేసీఆర్‌కు తెలుసు అన్నారు. ఆ విషయంలో అరెస్ట్ అవుతానని కేసీఆర్ ముందే ఊహించారని.. అందుకే గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ కేసీఆర్ ఏకపక్షంగా వాదిస్తున్నారని గుర్తుచేశారు.

*కేసీఆర్‌ ప్రమేయంతోనే అన్ని శాఖల్లో స్కాములు : అద్దంకి*

జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణలో తన పేరు ఉందని కేసీఆర్‌ బాధపడటంలో అర్ధం లేదని కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ ట్విటర్‌ ఎక్స్‌లో వీడియో విడుదల చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయంలో అన్ని శాఖల్లో కేసీఆర్‌ ప్రమేయంతోనే స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు. తన పేరు బద్నాం చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తుందని కేసీఆర్‌ అనడం తప్పు అని కొట్టిపారేశారు. ఆయా శాఖల మంత్రుల ప్రమేయం లేకుండా అన్ని స్కామ్‌లు జరిగినట్లుగా విచారణలో తెలుస్తుందని స్పష్టం చేశారు.

Related posts