Praja Kshetram
తెలంగాణ

పరిశ్రమలు వచ్చేనా.. ఉపాధి దక్కేనా?

పరిశ్రమలు వచ్చేనా.. ఉపాధి దక్కేనా?

*-కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు ఉపాధి కల్పనపై హామీ*

*అమూల్‌, కోకాకోలా, ఆటోమొబైల్‌ కంపెనీలతో ఎంవోయూ*

*-కంపెనీల ఏర్పాటుపై ఇప్పటికీ అతీగతి లేని వైనం*

*-ప్రభుత్వ నిర్ణయమే కీలకం*

*-ఇటీవల కోకాకోలా యూనిట్‌ తరలిపోయినట్లు వార్తలు?*

గజ్వేల్‌, జూన్‌ 16 (ప్రజాక్షేత్రం): హైదరాబాద్‌కు అతిచేరువలో ఉన్న సిద్దిపేట జిల్లా ములుగు, వర్గల్‌ మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వం అడుగులు వేసింది. కాలుష్య రహిత పరిశ్రమలను తీసుకొచ్చి, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ భూనిర్వాసితులకు, అలాగే గజ్వేల్‌ నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించేడమే లక్ష్యమని ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఇదే అంశాన్ని ఊదరగొట్టారు. పరిశ్రమలు వచ్చాయని, ఎంవోయూలు చేసుకున్నామని చెప్పిందంతా ఆర్భాటంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం మారడంతో నీలినీడలు కమ్ముకున్నాయి. ఎంవోయూ కుదుర్చుకున్న పరిశ్రమలు సైతం ఏర్పాటవుతాయో లేదో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా పలు పరిశ్రమలు ఇతర జిల్లాలకు తరలివెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

*దాదాపు 3వేల ఎకరాల సేకరణ*

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని వర్గల్‌, ములుగు మండలాల పరిధిలోని నాగిరెడ్డిపల్లి, అవుసులోనిపల్లి, వర్గల్‌, ములుగు, అచ్చాయపల్లి గ్రామాల పరిధిలో మూడు వేల ఎకరాల సాగు భూమిని 2021-22 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం హుటాహుటిన సేకరించింది. ఇక్కడ టీజీఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమ కాలనీని ఏర్పాటు చేశారు. ఈ భూములకు సంబంధించిన పరిహారాలను అందజేసిన అధికారులు, పలు పరిశ్రమలకు భూములను కేటాయిస్తున్నట్లు కూడా ప్రకటించారు. వర్గల్‌కు కోకాకోలా, అమూల్‌, ఆజాద్‌ ఎలక్ట్రికల్స్‌ లాంటి పరిశ్రమలు వస్తున్నాయని, ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకున్నామని ఆర్భాటంగా ప్రచారం చేశారు. కానీ కేవలం రెండు పారాబాయిల్డ్‌ పరిశ్రమలు, ఓ ఐస్‌క్రీం పరిశ్రమ మినహా ఎలాంటి భారీ పరిశ్రమలు ఇప్పటివరకు వచ్చిన దాఖలాలు లేవు. ఇక కోకాకోలా కంపెనీ పెద్దపల్లి జిల్లాకు వెళ్లినట్లు తెలియగా, ఐటీ శాఖ మంత్రిని కోకాకోలా పరిశ్రమకు చెందిన ప్రతినిధులు కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రజల్లో కొంత అభద్రతా భావం ఏర్పడింది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సేకరించిన భూములకు ఇచ్చే నష్టపరిహారం అంశంలో కోర్టులకు వెళ్లారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో వారు ముందుకు వెళ్తారా లేక వెనక్కి వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

*రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారం*

వర్గల్‌, ములుగు మండలాల్లో ఏర్పాటు చేసిన టీజీఐఐసీ కాలనీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై తాజాగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమే కీలకంగా మారనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణను మూడు జోన్‌లుగా విభజించి అభివృద్ధి పరుస్తామని ప్రకటించారు. వర్గల్‌, ములుగు ప్రాంతం సేమీ అర్భన్‌ ప్రాంతమైన అవుటర్‌ రింగ్‌రోడ్డు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు మధ్యలో ఉండడంతో పరిశ్రమల ఏర్పాటు అనివార్యం కానుంది. అయితే, కొండపొచమ్మసాగర్‌, మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల పరిస్థితి ఇప్పటికే ఉపాధి లేక అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు ఆధారపడింది.

Related posts