Praja Kshetram
జాతీయం

ఈవీఎంలు … బ్లాక్‌ బాక్స్‌ల వంటివి

ఈవీఎంలు … బ్లాక్‌ బాక్స్‌ల వంటివి

 

*-ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌పై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు*

*-విబేధించిన మాజీ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌*

ఢిల్లీ జూన్ 16 (ప్రజాక్షేత్రం): ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను కొంత మేరకు హ్యాక్‌ చేసే అవకాశాలున్నాయని, ఈవీఎంలను వాడకుండా పక్కన పెట్టాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. భారత్‌లో వినియోగించే ఈవీఎంలు బ్లాక్‌ బాక్సుల వంటివని.. కనీసం వాటిని పరిశీలించేందుకు సైతం ఎవరికీ అనుమతి ఇవ్వరని విమర్శించారు. ఇలాంటివి చూస్తుంటే మన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రస్థాయిలో సందేహాలు కలుగుతున్నాయని రాహుల్‌ పేర్కొన్నారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుందన్నారు. అయితే, మొబైల్‌ ఫోన్‌ సహాయంతో ఈవీఎంను హ్యాక్‌ చేసిన ఆరోపణలపై ముంబయి నార్త్‌ వెస్ట్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో 48 ఓట్లతో గెలిచిన శివసేన (ఏక్‌నాథ్‌ షిండే) ఎంపీ అభ్యర్థి రవీంద్ర వైకర్‌ బంధువుపై నమోదైన కేసుకు సంబంధించిన క్లిప్పింగ్‌ను సైతం రాహుల్‌ జతచేశారు. రాహుల్‌ గాంధీ చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌పై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సైతం స్పందించారు. భారతీయ ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్‌ చేయలేరన్నారు. భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవని.. వాటికి ఎలాంటి కనెక్టివిటీ లేదన్నారు. బ్లూటూత్‌, వైఫై లేదని.. ఇంటర్నెట్‌ సదుపాయం లేదన్నారు. రీప్రోగ్రామ్‌ చేయలేరని ఫ్యాక్టరీ ప్రోగ్రామ్డ్‌ కంట్రోలర్‌లని పేర్కొన్నారు.

Related posts