Praja Kshetram
క్రైమ్ న్యూస్

బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. 15మంది మృతి

బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. 15మంది మృతి

 

-కాంచన జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఢీ కొట్టిన గూడ్స్‌

-రాష్ట్రపతి, ప్రధానిల సంతాపం

-సిగ్నల్ జంప్‌తోనే ప్రమాదం

పశ్చిమ బెంగాల్ జూన్ 17 (ప్రజాక్షేత్రం): పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం అస్సాంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును న్యూజల్‌పాయ్‌ గుడి జంక్షన్‌ సమీపంలోని రంగపాని స్టేషన్‌ వద్దకు రాగానే అదే ట్రాక్‌పై వెనుకనుంచి వచ్చిన ఓ గూడ్స్‌ రైలు బలంగా ఢీ కొట్టింది. దీంతో కాంచన్‌జంగా రైలుకు చెందిన ఓ బోగీ గాల్లోకి లేచింది. ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందగా, మరో 60 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాంచన జంగా ఎక్స్‌ప్రెస్‌ను రంగపాని-నిజార్బి స్టేషన్ల మధ్య అదే ట్రాక్‌పె వస్తున్న గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీ కొట్టింది.

 

 

ప్రమాదంలో గూడ్స్ బోగి ఒకటి ఎక్స్‌ప్రెస్ రైలు బోగి కిందకు దూసుకెళ్లడంతో ప్రయాణికుల బోగి గాల్లోకి లేచిన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. ప్రమాదం ధాటికి రెండు రైళ్ల బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ బోగీలు రెండు పట్టాలపై నుంచి పక్కకు పడిపోయాయి. పలు కోచ్‌లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇక గూడ్స్‌ రైలు డబ్బాలు అంత దూరంలో పడిపోయాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

 

సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. రెడ్ సిగ్నల్ వేసినా గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లడంతోనే ప్రమాదానికి కారణమని అధికారిక వర్గాలు తెలిపాయి.

 

*ప్రమాదంలో గూడ్స్ రైలు డ్రైవర్‌, అసిస్టెంట్‌, ఎక్స్‌ప్రెస్ గార్డు మృతి*

 

ప్రమాదంలో గూడ్స్‌ రైలు డ్రైవర్‌, అసిస్టెంట్‌ డ్రైవర్‌తో పాటు, కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ గార్డు మరణించారని రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈవో జయ వర్మ సిన్హా వెల్లడించారు. ఘటనాస్థలి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు చూస్తేనే ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తుందని, ఈ ఘటనలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

 

*పలు రైళ్లు దారి మళ్లింపు..*

 

రెండు రైళ్లు ఢీ కొట్టడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రూట్‌లో వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. రైలు ప్రమాద ఘటనపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్‌ రైలు ఢీ కొట్టిన ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన షాక్‌కు గురి చేసిందన్నారు. వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో పలువురు మరణించిన వార్త చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. మరోవైపు రైలు ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం విచారం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదం బాధాకరమని, తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. బాధితులకు సహాయం చేయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా ట్వీట్ చేశారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ సైతం సంతాపం తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా పేర్కోన్నారు.

Related posts