Praja Kshetram
జాతీయం

‘రాయ్‌బరేలి’కే రాహుల్‌గాంధీ.. ‘వాయనాడ్‌’లో పోటీకి ప్రియాంకాగాంధీ

‘రాయ్‌బరేలి’కే రాహుల్‌గాంధీ.. ‘వాయనాడ్‌’లో పోటీకి ప్రియాంకాగాంధీ

 

 

 

ఢిల్లీ జూన్ 17 (ప్రజాక్షేత్రం): కాంగ్రెస్‌ ముఖ్య నేత రాహుల్‌గాంధీ కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ స్థానాన్ని వదులుకోనున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి ఎంపీగా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. అయితే రాహుల్‌గాంధీ రాజీనామా చేస్తున్న వాయనాడ్‌ నుంచి ఆయన సోదరి ప్రియాంకాగాంధీ బరిలో దిగనున్నారు. ఆమె తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, మరో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే ఇటీవల రాహుల్‌గాంధీ గెలిచిన రెండు ఎంపీ స్థానాల్లో దేన్ని వదులుకోవాలనే విషయంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆ నిర్ణయాన్ని మీడియాకు ప్రకటించారు. తాను వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసి, రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్‌గాంధీ చెప్పారు. వాయనాడ్‌ స్థానాన్ని వదులుకున్నప్పటికీ అక్కడి ప్రజలతో తన అనుబంధం కొనసాగుతుందని చెప్పారు. రాయ్‌బరేలీ, వాయనాడ్‌లలో ఏ స్థానాన్ని వదులుకోవాలనే విషయాన్ని తేల్చుకోవడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు.

Related posts