రైతులకు మరింత చేరవయ్యేలా భూ పరిపాలనలో మార్పు తేవాలి … రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం
*-కొత్త మండలాల్లో క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలి*
*-గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి*
*-రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరపాలి*
*-పెండింగ్ బిల్లుల మంజూరుతో పాటు అద్దె వాహన ఛార్జీలు పెంచాలి*
*-జీఓ నం.317ను వెంటనే రద్దు చేయాలి*
*-తహశీల్దార్లను పూర్వ స్థానాలకు బదిలీ చేయాలి*
*-తహశీల్దార్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విజ్ఞప్తి*
హైదరాబాద్ జూన్ 17 (ప్రజాక్షేత్రం): రైతులకు మరింతగా చేరువయ్యేందుకు భూ పరిపాలనలో సమగ్రమైన మార్పులు తేవాలని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) నాయకులు కోరారు. రాష్ట్రంలోని ఉద్యోగులను చిన్నాభిన్నం చేసిన జీఓ నం.317ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానానికి స్వస్తి పలికి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. పూర్వ వీఆర్ఏ, వీఆర్ఓల న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. హైదరాబాద్‌లోని టీజీటీఏ కార్యాలయంలో సోమవారం టీజీటీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీజీటీఏ రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో పాటు వివిధ జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో తహశీల్దార్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, ధరణి, భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశానికి హాజరైన డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రెవెన్యూ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతోనే రైతుల సమస్యలు తీరుతాయన్నారు. క్షేత్రస్థాయిలోనే రైతుల సమస్యలను పరిష్కారం చేసే వ్యవస్థను తేవాలన్నారు. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. అనంతరం ఆయా సమస్యలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.
*మంత్రి పొంగులేటికి సమస్యల వినతి పత్రం*
అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దూర ప్రాంతాలకు బదిలీ అయిన తహశీల్దార్లు కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇబ్బంది పడుతున్నారని, వీరిని మళ్లీ పూర్వ స్థానాలకు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న అర్హులైన తహశీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల(ఎస్‌జీడీసీ)లకు పదోన్నతులు కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తహశీల్దార్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే అద్దె వాహనాల ఛార్జీలు చాలా రోజులుగా పెరగలేదని, పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అద్దె వాహనాల ఛార్జీలను పెంచడంతో పాటు పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో రెవెన్యూ శాఖలో పని చేస్తున్న తహశీల్దార్లు, ఇతర సిబ్బందికి సమయానికి వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వీరికి క్రమం తప్పకుండా వేతనాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా మండలాలను ఏర్పాటు చేసినప్పటికీ సరైన క్యాడర్ స్ట్రెంత్ లేక విధులు వేగంగా, సాఫీగా జరగడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి, పూర్తి స్థాయి క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ శాఖకు ఆయువుపట్టు లాంటి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం కనుమరుగైందని, వీఆర్ఏ, వీఆర్వోలను ఇతర శాఖల్లోకి పంపించడం వల్ల గ్రామాల్లో రెవెన్యూ పాలనకు బాధ్యులు ఎవరూ లేకుండా పోయారని తెలిపారు. ఇది భూపరిపాలనలో సమస్యలకు కారణమవుతోందని, కావున, గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ శాఖకు సంబంధించి గతంలో అధికారాలను ఎక్కువగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల వద్ద కేంద్రీకృతం చేయడం జయడం వల్ల భూసమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందని తెలిపారు. రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, కాబట్టి రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. భూవివాదాలు వచ్చినప్పుడు రైతులు సివిల్ కోర్టులకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, కావున, వారికి అందుబాటులోనే వివాదాలు పరిష్కారమయ్యేలా రెవెన్యూ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శులు రమేష్ పాక, అరేటి రాజేశ్వర్, సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ చౌహాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు పి.రాధ, కోశాధికారి శ్రీనివాస్ శంకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.