ఖైరతాబాద్ గణేష్‌కు కర్రపూజ ప్రారంభం.. ఈ ఏడాది ఎన్ని అడుగులంటే..?
హైదరాబాద్ జూన్ 17(ప్రజాక్షేత్రం): భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేశుడికి భక్తులంతా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహం ఏర్పాటు పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.ఖైరతాబాద్ గణపతికి సోమవారం కర్రపూజ చేశారు. ప్రతి ఏడాది నిర్మల ఏకాదశి రోజున గణపతికి కర్ర పూజ నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది.ఈరోజు నుంచి మహాగణపతి పనులు ప్రారంభంకానున్నాయి. ఈ సంవత్సరం వినాయక చవితిని పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో 70 అడుగుల మట్టి విగ్రహాన్ని నిర్వాహకులు రూపొందించనున్నారు. ఖైరతాబాద్ గణేష్‌ను1954లో తొలిసారిగా ప్రతిష్ఠించారు. ఈ ఏడాదితో లంభోదరుడికి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలోఈ సంవత్సరం 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్వాహకులు అనుకుంటున్నారు. గతేడాది ఇక్కడి వినాయకుడు 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా సరికొత్త రికార్డు సృష్టించాడు.