65 ఐటీఐలకు కొత్త సొబగులు.. 2324 కోట్లతో అభివృద్ధి చేస్తామన్న .. సీఎం రేవంత్
హైదరాబాద్ జూన్ 18 (ప్రజాక్షేత్రం): రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ లు నిరుపయోగం మారాయని, వీటిలో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐ ల్లో నేర్పిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేసేలా రాష్ట్రంలోని మొత్తం 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మంగళవారం మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్గ్రేడేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించిందని చెబుతూ.. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని రేవంత్ చెప్పారు. తన ఆలోచనల నుంచి వచ్చిందే ఏటీసీ సెంటర్స్ అని తెలిపారు. ‘మేం పాలకులు, మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు.. మేం సేవకులం’ అని సీఎం స్పష్టం చేశారు. 40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. సర్టిఫికెట్ ఉంటే సరిపోదని, సాంకేతిక నైపుణ్యం ఉండాలని అన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని చెప్పారు. కేవలం సర్టిఫికెట్స్ జీవన ప్రమాణాలను పెంచవని అన్నారు. దుబాయ్ లాంటి దేశాలకు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారెంటీ ఇస్తుందని తెలిపారు. టాటా సంస్థ సహకారంతో సాంకేతిక నైపుణ్యాల కోసం 2324 కోట్లతో 65 ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని ప్రకటించారు. విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఐటీ రంగంలో ప్రపంచం తో మన తెలుగు వారు పోటీ పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే తమ బాధ్యత అన్నారు. అందుకే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దుతామని, నైపుణ్యాలను నేర్పించడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పిస్తామని చెప్పారు. విద్యార్థినీ విద్యార్థులు ఐటీఐల్లో చేరాలని కోరారు. ఈ శాఖ తన వద్దే ఉంటుందని, తానే పర్యవేక్షిస్తూ.. ప్రతి నెలా సమీక్షిస్తానని తెలిపారు.