Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఆ మూడే కీలక లక్ష్యాలు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఆ మూడే కీలక లక్ష్యాలు!

 

-అమరావతి నిర్మాణం

-పోలవరం పూర్తి

-విశాఖ ఉక్కు రక్షణ

అమరావతి జూన్ 18 (ప్రజాక్షేత్రం):ఏపీలో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం ముందు మూడు ప్రధాన లక్ష్యాలు కనిపిస్తున్నాయి. పదేళ్లుగా అవి జనం కోరుకుంటున్నవి. ఈ మూడింటిలో ముఖ్యమైనది రాజధాని నిర్మాణాన్ని తర్వగా పూర్తి చేయడం. దీనితో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆ ఫలాలను రైతులకు అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మరో ముఖ్యమైన అంశం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలిపివేయించడం. విశాఖ ఉకును ప్రైవేటీకరిస్తామని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైనా కేంద్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు కేంద్రంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్నందున ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. విభజన సందర్భంగా నాటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌తో పాటు, పరిశ్రమల్లో రాయితీ ఇస్తామని హామీ ఇచ్చింది. పదేళ్లుగా ఇవి అమల్లోకి రాలేదు. ఏపీ సీఎం వైజాగ్‌ను ఆర్థిక రాజధానిగా ప్రకటించాక అక్కడి మరిన్ని పరిశ్రమలు వచ్చేలా, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేలా ఆ నగారాన్ని తీర్చిదిద్దడం ఆయన ముందున్న పెద్ద సవాలని విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు తన క్యాబినెట్‌ కూర్పులోనూ కూటమి భాగస్వామ్యపక్షాలను ప్రాధాన్యం కల్పించారు. రాజకీయ కక్షల కంటే రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అద్భుత విజయానికి అనుగుణంగా వారికి అభివృద్ధి ఫలాలు అందించాలన్నది తన ఉద్దేశమని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం దానిపై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి కావడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించుకోవడం ఈసారి కష్టమేమీ కాకపోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి రాజధాని అమరావతే అని అనేకసార్లు స్పష్టం చేసింది.

ఇప్పుడు కేంద్రంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్నందున మోదీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి కావడానికి అవసరమయ్యే నిధులను అందించాల్సి ఉన్నది. ఒకవేళ ఏపీకి పరిశ్రమల్లో రాయితీ ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులోనూ, బయట కూడా బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. చంద్రబాబు ఏపీ, తెలంగాణ తనకు రెండు కండ్లు అని ఉద్యమ సమయంలో అన్నారు. ఇప్పుడు పరిశ్రమలకు రాయితీ విషయంలో తెలంగాణ పట్ల ఎలా వ్యవహరిస్తారు? రేవంత్‌ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుతారనే చూడాలి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెలగపూడిలోని సచివాలయంలో తన చాబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని, 15 రోజుల్లో అధ్యయనం చేసి టైమ్ బౌండ్ నిర్ణయిస్తామని చెప్పారు.

Related posts