వరంగల్ మేయర్‌కు ‘అవిశ్వాసం’ ఉచ్చు … పావులు కదుపుతున్న ప్రత్యర్ధులు
*-బీఆరెఎస్, బిజెపి కార్పొరేటర్ల వ్యూహం*
*-కక్కలేని మింగలేని స్థితిలో కాంగ్రెస్ కార్పొరేటర్లు*
*-20న కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం*
*-అడ్డుకుంటామని కార్పొరేటర్ల హెచ్చరిక*
ప్రజాక్షేత్రం ప్రత్యేక ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి పై అవిశ్వాస అస్త్ర ప్రయోగం ఫలిస్తుందా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. మేయర్ సుధారాణిని ఆ పదవి నుంచి తొలగించడమే లక్ష్యంగా అవిశ్వాస ఆయుధాన్ని ఆమె ప్రత్యర్ధులు ప్రయోగిస్తున్నారు. అయితే ఇది ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆరెఎస్, బిజెపితోపాటు కాంగ్రెస్ పార్టీలోని సుధారాణి వ్యతిరేకులు ఆమెపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎలాగైనా మేయర్ పదవి నుంచి ఆమెను దింపివేయాలని గట్టిపట్టుదలతో పావులు కదుపుతున్నారు. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని కోపంతో బీఆరెఎస్ కార్పొరేటర్లు రగిలిపోతుండగా బిజెపి కార్పొరేటర్లు వారికి అండగా నిలుస్తున్నారు. ఇక బీఆరెఎస్ లో సుధారాణి వ్యతిరేకులుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు సైతం ఆమెపై అంతర్గతంగా ఆగ్రహంతో ఉన్నారు.
*– ఇరుకునపడిన కార్పొరేటర్లు*
సుధారాణి బీఆరెస్ పార్టీకి షాకిచ్చి కాంగ్రెస్ పార్టీలోకి మారడం ఇప్పుడు అందరికీ ఒక్కసారిగా ఇబ్బందికరంగా మారింది. తాజా ఈ పరిస్థితుల్లో సుధారాణి వ్యతిరేకులంతా ఆఖరికి మంత్రి కొండ సురేఖ కూడా ఒకే తాటిపైకి వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించుకోగలుగుతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తన మేయర్ పదవిని రక్షించుకునే లక్ష్యంతోటే పార్టీ మారిన సుధారాణిని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుందా? కార్పొరేటర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని పదవి నుంచి తప్పిస్తుందా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
*– సుధారాణి పై కార్పొరేటర్లలో తీవ్ర అసంతృప్తి*
గుండు సుధారాణి బీఆరెఎస్ నుంచి మేయర్‌గా ఎన్నికైంది. ఒక మాటలో చెప్పాలంటే బీఆరెఎస్ బలమైన పార్టీగా కార్పొరేషన్ లో ఎన్నికై మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బీఆరెఎస్ అధిష్టానం అండతో సుధారాణి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు కార్పొరేటర్లు మాత్రమే గెలుచుకుంది. మేయర్ గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని తన పదవీ కాలాన్ని మరికొంత కాలం కొనసాగించాలని సుధారాణి భావిస్తుంది. ఆమె బీఆరెఎస్ లో ఉన్నప్పుడే కార్పొరేటర్లు ఆమెపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. మేయర్ గా ఆమెని తప్పించాలని భావించారు. ఆమె ఏకపక్ష విధానాలు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శలు ఉన్నాయి కార్పొరేటర్లను చులకనగా చూస్తోందని అభిప్రాయం సర్వత్రా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలకతీతంగా సుధారాణిపై కార్పొరేటర్లలో తీవ్ర వ్యతిరేకత ఉంది.
*– బీఆరెఎస్ కు షాక్ ఇచ్చిన మేయర్ సుధారాణి*
ఈ స్థితిలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో బీఆరెఎస్ అధికారాన్ని కోల్పోయిందీ. అప్పటివరకు అధిష్టానానికి నమ్మకంగా వ్యవహరించిన మేయర్ కొద్ది రోజుల క్రితం అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె కంటే ముందు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో ఎక్కువమంది సుధారాణి వైఖరిని నిరసిస్తూ ఆమెను మేయర్ పదవి నుంచి దింపివేయాలని ఏకైక లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ వీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది కాలానికి సుధారాణి సైతం ఆ పార్టీలో చేరడంతో ఈ అసంతృప్తి కార్పొరేటర్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. కాంగ్రెస్ లోకి సుధారాణి రాకను వీరు వ్యతిరేకించినప్పటికీ అడ్డుకోలేకపోయారు. అయినప్పటికీ సుధారాణిపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. ఈ లోపు పార్లమెంటు ఎన్నికలు రావడంతో మేయర్ పై అవిశ్వాస వ్యవహారం తాత్కాలికంగా వాయిదా పడింది తాజాగా ఈనెల 20వ తేదీన కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించడంతో కార్పొరేటర్లంతా మరోసారి అవిశ్వాస వ్యవహారాన్ని అజెండాపైకి తెచ్చారు జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
*– పావులు కదుపుతున్న బీఆరెఎస్, బిజెపి*
పీటర్ వరంగల్ కార్యాలయంలో మంగళవారం వరంగల్ బీఆరెఎస్, బిజెపి కార్పొరేటర్లు అత్యవసర సమావేశం నిర్వహించారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి వెళ్లనున్నట్లు బీఆరెఎస్, బిజెపి కార్పొరేటర్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గనేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆసక్తి చూపినా, అధిష్టానం నుండి ఒత్తిడి రావడంతో వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. అయితే అవిశ్వాస తీర్మానానికి అధికార పార్టీ కార్పొరేటర్లు సైతం ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం.
జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండా బడ్జెట్ సమావేశం నిర్వహించడం పై బీఆరెఎస్, బిజెపి కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన పెడచెవిన పెట్టడంతో, 20వ తారీకున జరిగే కౌన్సిల్ బడ్జెట్ సమావేశాన్ని అడ్డుకుంటామని రెండు పార్టీల కార్పొరేటర్లు చెబుతున్నారు. దీనికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలోని మేయర్ వ్యతిరేక వర్గం కూడా సహకరిస్తున్నట్లు సమాచారం.
*– కక్కలేని మింగలేని పరిస్థితిలో కాంగ్రెస్ కార్పొరేటర్లు*
కక్కలేని మింగలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్ సుధారాణికి వ్యతిరేకంగా పార్టీ మారినప్పటికీ వారి అంచనాలను తారుమారు చేస్తూ ఆమె కూడా పార్టీ మారడంతో కార్పొరేటర్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కార్పోరేటర్లకు మద్దతు తెలిపిన మంత్రి సురేఖ కూడా ఈ విషయంలో ఇబ్బందికి లోనయ్యారు. ఈ స్థితిలో అధికార పార్టీలో ఉన్న మేయర్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ కార్పోరేటర్లు అవిశ్వాస తీర్మానంలో భాగస్వామ్యం అవుతారా లేదా అనేది ఇప్పుడు చిక్కుముడిగా మారింది. మొన్నటి వరకు బీఆరెఎస్, బిజెపి కాంగ్రెస్ అసంతృప్త కార్పొరేటర్లు అంతా ఒక్కటిగా కనిపించినప్పటికీ రానున్న రోజుల్లో ఇదే తీరుగా కలిసికట్టుగా ఉంటారా లేదా అనేది తేలనున్నది.