నీట్ పరీక్ష పేపర్ లీకేజి పై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
హైదరాబాద్ జూన్ 18 (ప్రజాక్షేత్రం): నీట్ ప్రశ్నపత్రం లీకేజ్‌ను నిరసిస్తూ, పరీక్షను పూర్తిగా రద్ధు చేసి తిరిగి నిర్వహించాలని, లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యేతర పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు మంగళవారం హైదరాబాద్ సహా జిల్లాల్లో నిరసనలు నిర్వహించాయి. హైదరాబాద్‌లో ఎన్‌ఎస్‌యూఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ విద్యార్థి, యువజన సంఘాలు నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు ర్యాలీలు నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థి సంఘాల ర్యాలీలతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని, ఎన్‌టీఏ చైర్మన్‌ను విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
*రాజ్‌భవన్ ముట్టడించిన బీఆరెస్వీ*
నీట్ ప్రశ్నపత్రం లీకేజీని నిరసిస్తూ బీఆరెస్ విద్యార్థి విభాగం బీఆరెస్వీ రాజ్‌భవన్‌ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని బీఆరెస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆరెస్వీ నాయకులను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని, దీనిపై వెంటనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించకపోతే రాబోయే రోజుల్లో బీఆరెస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. నీట్ పరీక్ష అక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నామని, సీఎం స్పందించకపోతే వారి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
*సిద్దిపేటలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం*
నీట్ పరీక్ష పేపర్ లీకేజిపై మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీడీఎస్‌యు, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, యూత్ కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహకం వల్ల దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల విద్యార్థులు నీట్ పరీక్ష పేపర్ లీకేజి వల్ల నష్ట పోయారని ఆరోపించారు. ఇంత జరిగినా దేశ ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌టీఏను రద్దు చేసి నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ నేతలు అజ్మత్, సంజీవ్, వహాబ్ మాట్లాడుతూ తక్షణమే నీట్ పరీక్ష ఫలితాలను రద్దుచేసి నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్రాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ విషయంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని బాధ్యులను చట్టప్రకారం శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి భాను, ఉపాధ్యక్షుడు అజ్మత్ అలి, ఎస్‌ఎఫ్‌ఐ, పీడిఎస్‌యూ నాయకులు ర్యాషద్, రవి, నిశాంత్ గౌడ్, ప్రతాప్, వంశి,సాయి రాజా,క్రాంతి,రాజా బాబు,లక్ష్మణ్, జవిద్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.