చిరంజీవికి ప్రధాని రాజ్యసభ ఆఫర్..! స్పందించిన మెగాస్టార్ కూతురు సుస్మిత..!
అమరావతి జూన్ 19 (ప్రజాక్షేత్రం): ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి జయకేతనం ఎగురవేసింది. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌గా పదవీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఆ తర్వాత చిరంజీవికి మోదీ రాజ్యసభ ఎంపీ పదవి ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ విషయంపై చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత స్పందించింది. ప్రధాని మోదీ తన తండ్రికి రాజ్యసభ ఆఫర్ చేసిన విషయం తెలియదని చెప్పింది. సుస్మిత ‘పరువు’ వెబ్‌సిరీస్‌ని నిర్మిస్తున్నది. ఈ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే, తన పరిధిలోని అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారని.. చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ చేసిన వచ్చిన రూమర్స్ తమదాకా వచ్చాయన్నారు. ఇంట్లోనూ దీనిపై చర్చలు జరిగాయని తెలిపారు. రెండుమూడు రోజుల కిందట బాబాయ్ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారని.. ప్రస్తుతం తమ కుటుంబమంతా ఆ సెలబ్రేషన్ మూడ్‌లోనే ఉందని చెప్పుకొచ్చింది. ఏపీ కేబినెట్ పదవీ ప్రమాణస్వీకారానికి మోదీ హాజరు కాగా.. పవన్ స్వయంగా ప్రధాని వద్దకు తన సోదరుడు చిరంజీవిని తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రధాని మోదీ చిరంజీవి, పవన్ ఇద్దరి చేతులను పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు. ప్రధాని మోదీ చిరంజీవితో సన్నిహితంగా మెలగడంతో ఆయనకు రాజ్యసభ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే చిరంజీవి, పవన్ కల్యాణ్‌లో ఎవరో ఒకరు.. లేకపోతే బీజేపీ నేతలు క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది.