Praja Kshetram
తెలంగాణ

ఒకే భూమి చట్టం దిశగా.. తాసిల్దార్ వద్దే సమస్యల పరిష్కారం!

ఒకే భూమి చట్టం దిశగా.. తాసిల్దార్ వద్దే సమస్యల పరిష్కారం!

 

-భూవివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్స్

-సామాన్య రైతులకు అర్థం అయ్యేలా

-తెలంగాణ రెవెన్యూ ముసాయిదా బిల్లుపై సర్కారు కసరత్తు

-అన్నీ కుదిరితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే!

హైదరాబాద్ జూన్ 19 (ప్రజాక్షేత్రం): భూమి సమస్యలన్నీంటికీ పరిష్కారం చూపే విధంగా ఒకే భూమి చట్టం తీసుకు రావాలన్న దిశగా కాంగ్రెస్ సర్కారు తీవ్ర కసరత్తు చేస్తోంది. రైతులకు, మేధావులకు కూడా అర్థం కానీ విధంగా ఉన్న దాదాపు 124 భూమి చట్టాలన్నింటినీ కలిపి, వడపోసి, వాటి స్థానంలో ఒకే చట్టం తీసుకురానున్నది. ఈ మేరకు ఇటీవల ధరణి కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమైన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూములకు ఒకే చట్టం ఉండాలని, ఈ మేరకు ఒకే చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. ఈ చట్టాన్ని తీసుకు రావడం ద్వారా సమస్యల పరిష్కారంలో ఏర్పడే గందరగోళం తొలగి పోతుందని న్యాయ నిపుణులు చెపుతున్నారు. వీలైనంత తొందరగా తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసవరం అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు తీసుకు రావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ‘భూ సమస్యల పరిష్కారాన్ని సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసే ఏ చట్టమైనా దుర్మార్గమైనదే. వివాదం సృష్టించి కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోండని చెప్పడం అంటే సామాన్య హక్కులను గుంజుకొని సంపన్నుల/ బలవంతుల చేతిలో పెట్టడమే’’ అని సమాచారహక్కు మాజీ కమిషనర్, సీనియర్ పాత్రికేయులు కట్టా శేఖర్ రెడ్డి ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం భూమి సమస్యల పరిష్కారాన్ని సామాన్య ప్రజలకు అందుబుటులో ఉండే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చే ఒకే రెవెన్యూ చట్టం ఉండాలన్న అభిప్రాయం రైతుల కోసం పని చేస్తున్న అనేక సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా నిజాం పరిపాలనలో తెలంగాణకు ఒకే ఒక రెవెన్యూ చట్టం ఉండేది. ఈ చట్టాన్ని 1907వ సంవత్సరంలో నాటి నిజాం పాలకులు తీసుకు వచ్చారు. ఈ చట్టమే తెలంగాణ ఆంధ్రలో విలీనం అయ్యే వరకు అమలులో ఉంది. ఈ ఒక్క చట్టం ద్వారానే భూమి సర్వే, సెటిల్‌మెంట్, పరిపాలన, భూ రికార్డుల నిర్వహణ అంతా పకడ్బందీగా జరిగింది. నిజాం సంస్థానం భారత్‌లో విలీనం అయిన తరువాత ఏర్పడిన హైదరాబాద్ స్టేట్‌లో తెలంగాణ రెవెన్యూ చట్టానికి అదనంగా వ్యవసాయ భూములు, కౌల్దారీ చట్టం, హైదరాబాద్ ఆర్వో ఆర్ చట్టాలు వచ్చాయి. అయితే తెలంగాణకు రెవెన్యూ చట్టం ఉన్న సమయంలో బ్రిటిష్ పాలన కింద ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీలో భూ పరిపాలన బోర్డ్ ఆఫ్ స్టాండింగ్ ఆర్డర్స్ కిందనే జరిగేది కానీ ప్రత్యేక చట్టం లేదు.

తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసిన తరువాత తెలంగాణ రెవెన్యూ చట్టాన్ని నిర్వీర్యం చేసి, అనేక చట్టాలను తీసుకు వచ్చారు. ఇలా దాదాపు 124 చట్టాలను తెచ్చారు. దేశంలో దాదాపు ఐదు వేల చట్టాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏచట్టం ఏ సమస్యకు పరిష్కారం చూపుతుందనేది కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికి కూడా కీలకమైన సమస్యలు పరిష్కరించాలంటే 100 ఏళ్ల క్రితం చేసిన చట్టం వెలుగులోనే పరిష్కరించాల్సిన పరిస్థితి ఉందని భూ సంబంధ నిపుణులు అంటున్నారు. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో దేవేందర్ గౌడ్ రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో 1999లో ఒకే చట్టాన్ని తయారు చేశారు. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. ఆ తరువాత దీనిని ఎవరూ పట్టించుకోలేదు. ఈలోగా నాడు దేవేందర్ గౌడ్ పోర్ట్ఫోలియో కూడా మారింది. ఆ నాడే అమలులోకి రావాల్సిన కోడ్ అలాగే మరుగున పడిపోయింది. వాస్తవంగా రెవెన్యూ చట్టం అనేది రాష్ట్రాల పరిధిలోనిది. దీనిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాల్సిన అవసరం లేకున్నా.. ఆనాడు ఎందుకు పంపిచారో, ఏ ప్రయోజనాల కోసం పంపించారో నేటికి మిస్టరీగానే మిగిలిందని సీనియర్‌ పాత్రికేయులు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకే రెవెన్యూ చట్టాన్ని తీసుకు వస్తామని ప్రకటించారు.

 

దేశంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో రెవెన్యూ కోడ్ అమలులో ఉంది. దీనిని యూపీ రెవెన్యూ కోడ్ అని పిలుస్తారు. యుపీలో 2016లో వచ్చిన ఈ చట్టం అమలులో సక్సెస్ అయింది. దేశంలో చాలా రాష్ట్రాలు ఈ దిశగా ప్రత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిశా హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

రైతుల భూముల హక్కుల విషయంలో చిక్కుముళ్లు లేకుండా భూముల సమస్యలన్నింటికీ పరిష్కారం చూపే విధంగా ఒకే చట్టం ఉండాలని, రికార్డులలో ఎలాంటి గందరగోళం లేకుండా పకడ్బందీగా నిర్వహించడానికి కంప్యూటరీకరణ జరగాలని భూమి నిపుణులు అంటున్నారు. కొత్తగా ప్రభుత్వం తీసుకువచ్చే తెలంగాణ భూమి చట్టంలో రికార్డుల నుంచి మొదలు కొని సర్వే చేసి, పట్టాలు ఇచ్చే వరకు ఉండాలని కోరుతున్నారు. ఇదే తీరుగా తాసిల్దారు కార్యాలయంలోనే రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా నూతన చట్టం ఉండాలంటున్నారు. ముఖ్యంగా ధరణి చట్టంలో ఉన్న తీరుగా అధికారాల కేంద్రీకరణ కాకుండా, తాసిల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఇలా వివిధ స్థాయిలలో పరిష్కరించే విధంగా అధికారాల వికేంద్రీరణ ఉండాలని కోరుతున్నారు. సామాన్య రైతులను సివిల్ కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పరిష్కరించే వ్యవస్థ నూతనంగా తీసుకు రానున్న తెలంగాణ రెవెన్యూ కోడ్‌లో ఉండాలంటున్నారు. ధరణిని తీసుకురావడం ద్వారా గత ప్రభుత్వం తాసిల్దార్లకు, ఆర్డీవోలకు, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు ఉన్న అధికారాలను తొలగిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం వారి అధికారాలను పునరుద్ధరించింది. ఇదే తీరుగా, కొత్తగా తీసుకురానున్న రెవెన్యూ చట్టంలో అధికారాలను వికేంద్రీకరించి, రైతుల సమస్యలను తాసిల్దార్ల స్థాయిలోనే పరిష్కరించేందుకు అవకాశం కల్పించనున్నది. అలాగే.. రెవెన్యూ కోర్టులను, ట్రిబ్యున్లళ్లను కూడా పునరుద్ధరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

Related posts