మార్కెట్ కమిటీలపై నజర్
హైదరాబాద్ జూన్ 19 (ప్రజాక్షేత్రం): పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలను నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల నజర్ మార్కెట్ కమిటీలపై పడింది. ఆ పోస్టులను దక్కించుకునేందుకు నాయకులంతా మంత్రి, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలుచేసిన విధంగానే ఇప్పుడు కూడా రిజర్వేషన్ల ప్రకారమే పదవులను కట్టబెట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పార్టీ నాయకులు సైతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్లను రిజర్వేషన్ ప్రాతిపదికన నియమించారు. ప్రతి రెండేళ్లకోసారి రొటేషన్ పద్ధతిన పదవులను కట్టబెడుతున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రిజర్వేషన్లను కొనసాగిస్తుందా, ఆ విధానాన్ని ఎత్తివేస్తుందా అనే విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. రిజర్వేషన్లు ఎత్తివేస్తే పోటీదారులు ఎక్కువ అవుతారని భావిస్తున్న ప్రభుత్వం రిజర్వేషన్ల విధానాన్ని కొనసాగించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు సిగ్నల్స్ వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో జిల్లాలో ఉన్న 8 మార్కెట్ కమిటీలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ చుట్టూ తిరుగుతున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఉద్యమ బీఆర్‌ఎస్ పార్టీ మార్కెట్ కమిటీల నియామకాలకు సంబంధించి నూతన విధానాలను తీసుకవచ్చింది. అంతకుముందు ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా చైర్మన్లను నియమించేవాళ్లు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చైర్మన్ల నియామకాలకు సంబంధించి రిజర్వేషన్ల విధానాన్ని తీసుక వచ్చింది. పురుషులు, మహిళలకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఓసీలకు రొటేషన్ విధానాన్ని అమలుచేయాలని జీవో జారీ చేసింది. మార్కెట్ కమిటీల పదవీకాలం మొదట ఏడాది మాత్రమే ఉండగా, ఆ తర్వాత రెండేళ్ల క్రితం రెండేళ్లకు పెంచడం గమనార్హం. పదవీ కాలం ఏడాది ఉన్న వాళ్లకు మాత్రం ఆరు నెలల చొప్పున పదవీ కాలాన్ని రెండు, రెండున్నర సంవత్సరాల పాటు పొడిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
*-రిజర్వేషన్ల ప్రాతిపదికనే నియామకాలు..*
గత ఏడాది నవంబర్ నెలాఖరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వం చేపట్టింది. అప్పటివరకు ఉన్న మార్కెట్ కమిటీలన్నింటినీ రద్దు చేసింది. పదవీ కాలం ఉన్న కొన్ని మార్కెట్ల చైర్మన్లు కోర్టును కూడా ఆశ్రయించారు. వారికి అనుకూలంగా కోర్టు తీర్పు రాకపోవడంతో అన్నింటినీ మార్చి నెలలో రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 132 మార్కెట్ కమిటీలకు నామినేటెడ్ ప్రాతిపదికన చైర్మన్, డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. ఈ పదవులపై అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు పెంచుకున్నారు. జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, మంథని, కమాన్‌పూర్, రామగుండంలో మార్కెట్‌లు ఉన్నాయి. వీటికి నూతన పాలక వర్గాలను నియమించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయా మార్కెట్లకు అమలు చేసిన రిజర్వేషన్లు పోనూ పాత విధానం ప్రకారం అయితే పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి, సుల్తానాబాద్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి, జూలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీ సామాజిక వర్గానికి, కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్‌కు, ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్టీలకు, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్‌కు, కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్‌కు, రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించారు. రిజర్వేషన్లను అమలుచేస్తే మాత్రం ఆయా కేటగిరీలకు చెందిన వాళ్లకే చైర్మన్ పదవులు దక్కనున్నాయి. రిజర్వేషన్ల ప్రకారమే మార్కెట్ పదవులను కట్టబెట్టాలనే డిమాండ్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నది. రిజర్వేషన్లు ఎత్తేస్తే మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందని, మహిళలకు మొత్తానికి అవకాశం దక్కదని అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల ప్రాతిపదికనే కమిటీలను నియమిస్తే తమకు తలపోటు ఉండదని భావిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఈనెల 6వ తేదీ నుంచి ముగియడంతో ఆశావహులు మార్కెట్ పదవులను దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులను కట్టబెట్టాలని పార్టీ నాయకులు కోరుతున్నారు.