పట్టపగలే రెచ్చిపోయిన మరో అంతర్రాష్ట్ర ముఠా..
హైదరాబాద్ జూన్ 20 (ప్రజాక్షేత్రం): మేడ్చల్ లో మరో అంతర్రాష్ట్ర ముఠా రెచ్చిపోయింది. బంగారం దుకాణంలోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు యజమానిపై కత్తితో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మేడ్చల్‌లో గురువారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై మహిళల వేషంలో బురఖా ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు జగదాంబ జ్యువెల్లరీస్ షాపులోకి ప్రవేశించారు. హెల్మెట్ ధరించి ఉన్న ఇద్దరి దుండగుల్లో ఒకరు వెంటనే కత్తితో యజమాని గుండెలపై పొడిచాడు. బాధితుడు భయభ్రాంతులకు గురికావడంతో అతడి వద్ద నుంచి నగదు దోచుకున్నారు. భయంతో యజమాని శేషరం బయటకు పరుగులు తీసి గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఇంట్లో నుంచి వచ్చిన ఆయన కుమారుడు.. వారిపై కుర్చి విసిరివేశాడు. స్థానికులు వస్తారన్న భయంతో బంగారం దోచుకోకుండానే దుండగులు వెంటనే అక్కడ్నుంచి ద్విచక్రవాహనంపై పరారయ్యారు. షాపు యజమాని శేషరంకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుల సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మేడ్చల్ పరిసరాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
*ఇప్పటికే రెచ్చిపోతున్న భవారియా గ్యాంగ్, ధార్ గ్యాంగ్‌లు..*
ఇప్పటికే హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర ముఠాలు భవారియా గ్యాంగ్, ధార్ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. తాజాగా మరో గ్యాంగ్ రావడంతో నగరవాసులు హడలిపోతున్నారు. ఇప్పటికే భవారియా గ్యాంగ్ ముఠా సభ్యులు చోరీ చేసిన ద్విచక్రవాహనాలపై మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్ షామ్లి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అయితే మేడ్చల్‌లో దాడికి పాల్పడింది మరో కొత్త గ్యాంగ్‌గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వరస దాడులతో బెంబేలెత్తుతున్నారు. పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.