Praja Kshetram
తెలంగాణ

భావ స్వేచ్ఛకు భంగం కలగదు….టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల ముగింపు సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  

భావ స్వేచ్ఛకు భంగం కలగదు….టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల ముగింపు సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

 

 

 

ఖమ్మం జూన్ 20(ప్రజాక్షేత్రం): భావస్వేచ్ఛకు తమ ప్రభుత్వంలో భంగం కలగదని నిర్మాణాత్మకమైన విమర్శ అవసరమని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం టియూడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర నూతన అధ్యక్షులు విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ., మీడియా భద్రత కోసం ఒక చట్టాన్ని తీసుకరావాలనే మీడియా అకాడమి ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచనతో తాను ఏకీభవిస్తున్నానని, ఆ చట్టాన్ని తెచ్చేందకు కృషి చేస్తామని అన్నారు. పేదలందరికీ ఇల్లు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని విక్రమార్క పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల కేటాయింపు త్వరలోనే జరుగుతుందని హామీ ఇచ్చారు. జర్నలిజంలో యాజమాన్యాల ఆలోచనలు ఎలా ఉన్నా జర్నలిస్టు ఉన్నత ఆలోచనలతో నిజాలు రాయాలని ఆయన అన్నారు. మంచి జర్నలిజానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, ఈ విషయంలో జర్నలిస్టులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. రుణమాపీ విషయంలో అనుమానాలు, అపోహలు వద్దని, తప్పకుండా నూరుశాతం చేసి తీరతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిమతానికి అనుగుణంగా పని చేస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఉద్యోగాలు తదితర సౌకర్యాలన్నీ వస్తాయని అందరూ భావించారని, అది జరగలేదని, అదే సందర్భంలో మీడియాతో సహ ప్రజాస్వామ్యంలో ప్రజల భావ స్వేచ్ఛ విధ్వంసం అయిందని అన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి శీల భావాలు కలిగిన ఖమ్మంలో మహాసభలు జరగడం అభినందనీయమన్నారు. ఈ సభలో మీడియా అకాడమి ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ., జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఈ సభలో వైరా ఎంఎల్‌ఏ మాళోత్ రాందాస్ నాయక్, మాజీ ఎంఎల్‌సి పోట్ల నాగేశ్వరరావు, ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.

Related posts