మణిపూర్‌లో ఆగని హింస.. పోలీస్ చెక్ పోస్ట్, లారీకి నిప్పు
ఇంఫాల్ జూన్ 20 (ప్రజాక్షేత్రం): మణిపూర్‌లో హింస కొనసాగుతున్నది. సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెక్ పోస్ట్‌తోపాటు ఒక లారీకి నిప్పుపెట్టారు. ఉత్తర కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి 11.30 సమయంలో కాంగ్‌పోక్పి పట్టణంలోకి సరుకులు రవాణా చేస్తున్న లారీని కొందరు దుండగులు తగులబెట్టారు. నేషనల్ హైవే 102లోని కాన్‌పోక్పి, చాంగోబంగ్ గ్రామం మధ్యలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ వాహనం మైతీ వర్గానికి చెందినదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా, మరో సంఘటనలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో జిరిబామ్ జిల్లాలోని లింగాంగ్‌పోక్పి వద్ద నార్కోటిక్ ఖాళీ చెక్ పోస్ట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అయితే సాయుధులైన దుండగులు కాల్పులు జరుపగా ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని వెల్లడించారు.