24 గంటల్లో 5 హత్యలు.. 2 హత్యాయత్నాలు..! తెలంగాణ పోలీసులు ఎక్కడ..? సూటిగా ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ జూన్ 21(ప్రజాక్షేత్రం):దేశంలో హోం మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ మాత్రమే అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోం శాఖ, విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు తన గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాన్ని పూర్తిగా అభద్రతా భావంలోకి నెడుతున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 24 గంటల్లో 5 హత్యలు.. 2 హత్యాప్రయత్నాలు జరుగుతుంటే శాంతి భద్రత వ్యవస్థ ఎక్కడ ఉంది? పోలీసులు ఎక్కడికి పోయారు? అని సూటిగా ప్రశ్నించారు. పోలీసులు ఏ పనుల్లో బిజీగా ఉన్నారంటే.. రేవతి అనే ఒక జర్నలిస్ట్ కరెంటు లేదని ట్వీట్ చేస్తే ఆమె మీద సెక్షన్ 505, సెక్షన్ 66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 505 సెక్షన్ అనేది ప్రజల మీద భయాందోళనలు సృష్టించి, విద్వేషం రగిలించి, ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిని ఒకరు కొట్టుకోడానికి ప్రేరేపిస్తే అప్పుడు ఆ సెక్షన్ పెట్టాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి అదేశాలు ఏంటి అంటే ప్రశ్నించే వాళ్లు జర్నలిస్టులైన సరే, గృహిణులు అయినా, విద్యార్థులు అయినా సరే కేసులు పెట్టండని పోలీసులకు చెప్పాడు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కొల్లాపూర్ మండల పరిధిలోని మొలచింతలపల్లి గ్రామంలో ఓ గిరిజన మహిళను వారం రోజుల పాటు కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసులకు ఈ మాత్రం సమాచారం లేకపోవటమనేది ఈ రాష్ట్రంలో భద్రత వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సమాచరణ సేకరణ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నది అనేది మనకు అర్థం అవుతుంది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.