Praja Kshetram
పాలిటిక్స్

తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్టు

తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్టు

 

-బీఆరెస్‌కు బిగ్ షాక్‌

-కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి*

-స్వయంగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి

-తెలంగాణ పునర్ నిర్మాణం కోసం పోచారం కాంగ్రెస్‌లో చేరారన్న సీఎం

-రేవంత్ పాలనకు మద్దతుగా కాంగ్రెస్‌లో చేరుతున్నానన్న పోచారం

-మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్‌లోకి

-కాంగ్రెస్‌లోకి మరో 20మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు : దానం

-జానారెడ్డిని కలిసిన ఉప్పల్ బీఆరెస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

హైదరాబాద్ జూన్ 21 (ప్రజాక్షేత్రం): అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బలు తిన్న బీఆరెస్‌కు తాజాగా మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి షాక్‌ ఇచ్చారు. బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆయనను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌ ఆహ్వానం మేరకు పోచారం, ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి, భాస్కర్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించామన్నారు. పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరామని చెప్పారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్‌లో చేరారని చెప్పారు. రైతుల సంక్షేమంపై పోచారం సలహాలు, సూచనలు తీసుకుని ముందుకెళతామన్నారు. భవిష్యత్తులో పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. తమది రైతు సంక్షేమ రాజ్యమన్నారు. రైతుల కోసం చేపట్టబోయే కార్యక్రమాల్లో, పాలనలోనూ పోచారం సూచ‌న‌ల‌కు త‌ప్ప‌కుండా ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

 

*సీఎం రేవంత్ రెడ్డి పాలన నచ్చి మెచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నా*

 

గ‌త ఆరేడు నెల‌ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తున్నార‌ని పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశంసించారు. రేవంత్ కార్య‌క్ర‌మాలు న‌చ్చి, ఆయన నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చాల‌నే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. తెలంగాణ ఏర్ప‌డిన ప‌దేండ్ల‌కు రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిందని అన్నారు. గ‌త ఏడు నెల‌ల నుంచి రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తున్నానని, ఆ త‌ర్వాత‌నే రేవంత్‌ను తన నివాసానికి స్వాగతించానని తెలిపారు. రైతు సంక్షేమం కోసం, సాగునీటి ప్రాజెక్టుల ప్ర‌గ‌తి కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణ‌యాలు ఆమోద‌యోగ్య‌మైన‌వన్నారు. రైతు బిడ్డ‌ను కాబ‌ట్టి.. వ్య‌వ‌సాయంతో ఉన్న అనుబంధం తెలుసు కాబ‌ట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు అండ‌గా ఉండాల‌ని నిర్ణయించుకున్నానని చెప్పారు. రైతులు బాగుప‌డాల‌ని, వారి క‌ష్టాలు తీరాల‌నే ఉద్దేశంతో రేవంత్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. గ‌త ఆరేడు మాసాల నుంచి రేవంత్ రెడ్డి చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తున్నారని చెప్పారు. కొన్ని స‌మ‌స్య‌లు వచ్చినా వాటిని అధిగ‌మిస్తూ ముందుకు వెళ్తున్నారన్నారంటూ రేవంత్‌రెడ్డి మంత్రివర్గాన్ని అభినందించారు. తన జీవితంలో రాజ‌కీయంగా ఆశించేది ఏమీ లేదన్న పోచారం.. రైతుల‌తో పాటు వ్య‌వ‌సాయం బాగుండాలని కోరుకున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌గ‌తిలో చేదోడు వాదోడుగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నానని చెప్పారు. బీఆరెస్‌ కంటే ముందు టీడీపీలో ఉన్నానని, ఆనాడు ఉన్న ప‌రిస్థితుల‌ను మేరకు బీఆరెస్‌లో చేరానని చెబుతూ.. కాంగ్రెస్‌ పార్టీతోనే తన రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైందని, మ‌ళ్లీ చివ‌ర‌గా రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు

 

*బీఆరెస్‌లోకి 20మంది ఎమ్మెల్యేలు?*

 

లోక్‌సభ ఎన్నికల అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బీఆరెస్ నుంచి వలసలను ప్రొత్సహించే క్రమంలో ఏకంగా సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డికే కాంగ్రెస్ కండువా కప్పేశారు. బీఆరెస్‌లో కేసీఆర్ కుటుంబం తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యం కల్గిన కేకే, కడియం శ్రీహరి వంటి సీనియర్లు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోగా, ఇప్పుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిపోవడం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా పరిణామంగా నిలిచింది. గతంలో మాజీ సీఎం కేసీఆర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి లక్ష్మీ పుత్రుడు అని పేరు పెట్టి ఆప్యాయంగా పిలవడంతో పాటు ఆయన అడిగిందల్లా చేసిపెట్టారు. అయినా పోచారం బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో ఆ పార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ఆలోచనలో పడినట్టు తెలుస్తున్నది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్ శుక్రవారం పోచారం పార్టీ మార్పుపై స్పందిస్తూ మరో 20మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సైతం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. పోచారం కాంగ్రెస్‌లో చేరిన రోజునే ఉప్పల్ బీఆరెస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సైతం కాంగ్రెస్ సీనియర్ నేత కే జానారెడ్డిని కలిశారు. జానాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లారని చెబుతున్నా.. తెరవెనుక పార్టీ మార్పు కోణం ఉందని తెలుస్తోంది. అటు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి లక్ష్మారెడ్డి సహా పలువురు గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అదీగాక తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బలం పుంజుకున్న బీజేపీ.. మరింత బలోపేతం దిశగా బీఆరెస్ ఎమ్మెల్యేలపై కన్నేసిందన్న సమాచారంతో అప్రమత్తమైన రేవంత్‌రెడ్డి బీఆరెస్ ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు మండలిలోనూ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవిని కాపాడేందుకు బీఆరెస్ ఎమ్మెల్సీలను కూడా భారీ సంఖ్యలో పార్టీలో చేర్చుకునే కసరత్తులో కాంగ్రెస్ నాయకత్వం నిమగ్నమైందంటున్నారు.

 

*మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్‌లోకి?*

 

త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవి ఇచ్చే హామీతోనే పోచారం కాంగ్రెస్‌లో చేరినట్లుగా తెలుస్తున్నది. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి 1984లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వాల్లో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 27ఏండ్లు టీడీపీలో కొనసాగిన పోచారం 2011లో బీఆరెస్‌లో చేరారు. 2014నుంచి 2018వరకు కేసీఆర్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ రెండో పర్యాయం ప్రభుత్వంలో 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6వరకు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానంతో తిరిగి 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు మంత్రి పదవిని ఆఫర్‌ చేసిందనే ప్రచారం గట్టిగా వినిపిస్తున్నది.

Related posts