ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ‘జన దర్బార్’
అమరావతి బ్యూరో జూన్ 22 (ప్రజాక్షేత్రం): సమస్యలతో వచ్చే వారి నుంచి వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జనసేన పార్టీ కార్యాలయం వద్ద హెల్ప్‌డెస్క్‌లు (జన దర్బార్) ఏర్పాటు చేశారు. శాసన సభ సమావేశాలు ముగిసిన తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ స్వయంగా హెల్ప్‌డెస్క్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేశారని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి మొరపెట్టుకుంది. తమ కూతురు చదువుకునే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనిది కావడంతో మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల తరువాత జాడ తెలిశాక కూడా తమకు అప్పగించడం లేదంటూ ఎఫ్‌ఐఆర్ కాపీని చూపించడంతో, పవన్‌కల్యాణ్ మాచవరం సిఐకు ఫోన్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు జంపయ్య దంపతులు తమను ఇంటి కోసం సొంత మనుమళ్లే వేధిస్తున్నారని, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. రెవెన్యూ, పోలీస్ అధికారులతో మాట్లాడతానని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. కర్నూలుకు చెందిన సువర్ణ తన కుమారునికి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఆర్థిక సహాయం అందించాలని, జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీపాటి నాగరాజు తనను రాజకీయ కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించారని, తనను ఆదుకోవాలని వినతిపత్రాలు అందజేశారు.
వికలాంగులతో ప్రత్యేక సమావేశం
30మంది వికలాంగులు శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ను కలిశారు. వారందరితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పవన్‌కల్యాణ్‌కు సెక్రటేరియట్ హౌస్‌కీపింగ్ ఉద్యోగుల వినతి
రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న 154మంది హౌస్ కీపింగ్ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని పవన్‌కల్యాణ్‌ను కోరారు. శాసనసభ సమావేశాల రెండో రోజు శనివారం స్పీకర్ ఎన్నిక సందర్భంగా పవన్‌కల్యాణ్ అసెంబ్లీ ప్రాంగణమంతా కలియ తిరిగారు.
ఈ సందర్భంలో హౌస్‌కీపింగ్ సిబ్బంది తమ సమస్యలు విన్నవించుకున్నారు. రాజధాని ప్రాంత రైతు కూలీలం ఎనిమిదేళ్ల కిందట నెలకు రూ.6వేలకు ఉద్యోగంలో చేరామని, ప్రస్తుతం రూ.10వేలు ఇస్తున్నారని సిబ్బంది పేర్కొన్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో ఉన్నామని, అమరావతి రైతు కూలీలుగా ఉండటంతో తొలి రోజుల్లో నెలకు రూ.2,500 భత్యం వచ్చేదని, ప్రస్తుతం కీపింగ్ ఉద్యోగమని చెప్పి ఆ భత్యం నిలిపివేశారని పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని పవన్‌కల్యాణ్ హామీనిచ్చారు.