ఘనంగా వాల్మీకి ఫౌండేషన్ 16వ వార్షికోత్సవం
శంకర్ పల్లి జూన్ 22(ప్రజాక్షేత్రం): సమాజంలోని అణగారిన వర్గాలు, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తున్న పిల్లల అవసరాలను తీర్చడానికి కట్టుబడి ఉన్న లాభాపేక్షలేని అభివృద్ధి సంస్థ వాల్మీకి ఫౌండేషన్ వారి 16వ వార్షికోత్సవం శంకర్‌పల్లి మండల పరిధిలోని జన్వాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టర్కీ కన్సల్ జనరల్ ఓరాన్ యాల్మన్ ఓకన్, వాల్మీకి ఫౌండేషన్ అడ్వైజరీ బోర్డ్ సభ్యులు పద్మశ్రీ డా. మంజుల అనగాని, డా. రోహిణి రేగంటి, డా. శివనంద్ రెడ్డి, వివేక్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ గణేష్ వాల్మీకి, ప్రధాన కార్యదర్శి హరికిషన్ వాల్మీకి, సంయుక్త కార్యదర్శి పుష్ప వాల్మీకి మాట్లాడుతూ ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గత సంవత్సరం ప్రారంభించిన ఎండ్ పీరియడ్ పావర్టీ కార్యక్రమం రెండవ సంవత్సరం కూడా విజయవంతంగ కొనసాగుతోందని, ఈ చొరవ గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న బాలికలలో రుతుక్రమ పరిశుభ్రత ఉత్పత్తులకు అందుబాటులో లేని కొరతను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుందని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్‌పల్లి మండలంలోని 25 ప్రభుత్వ బడులలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు శనివారం వెయ్యి స్కూల్ బ్యాగులు, ఆరు వేల నోటు పుస్తకాలు, స్టేషనరీ కిట్, స్పోర్ట్స్ కిట్లు, లైబ్రరీ సెట్ అఫ్ బుక్స్ మరియు గ్రామీణ విద్యార్థినుల విద్యను ప్రోత్సహించడానికై కాలి నడకన వచ్చే విద్యార్థినులకు ఇరవై సైకిళ్లు, ఇతర సామాగ్రిని అందజేశారు. వాల్మీకి ఫౌండేషన్ ప్రెసిడెంట్ సూర్య గణేష్ వాల్మీకి ఈ వార్షికోత్సవ వేడుకల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ మహత్తర సందర్భంలో పేదరికం అంతం కార్యక్రమాన్ని కొనసాగించడం సంతోషకరమన్నారు. ఈ ప్రాంతంలో పదివేల శానిటరీ ప్యాడ్‌లను పంపిణీ చేయడంతో ‘ఎండ్ పీరియడ్ పావర్టీ’ ప్రచారం రెండవ సంవత్సరంలోకి ప్రవేశించింది. రాబోయే నెలల్లో ప్రత్యేక మొబైల్ పంపిణీ యూనిట్ ద్వారా తెలంగాణ అంతటా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలకు తన పరిధిని విస్తరించాలని ఈ కార్యక్రమ లక్ష్యం అని తెలిపారు. ధోబీపేట్‌లోని ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించాలని ఫౌండేషన్ యోచిస్తోందని, వెనుకబడిన ప్రాంతాలలో విద్య మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఫౌండేషన్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి, జన్వాడ ఎంపీటీసీ నాగేందర్, మిర్జాగూడ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, జన్వాడ మాజీ సర్పంచ్ లలిత నరసింహ, మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, సామాజిక కార్యకర్త మర్పల్లి అశోక్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నరహరి, జయసింహారెడ్డి, నర్సింగరావు, దేవేందర్ రెడ్డి, తహేర్ అలీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఫౌండేషన్ వాలంటీర్స్ పాల్గొన్నారు.