ఈశ్వరమ్మకు మాజీ మంత్రులు సబితా, సత్యవతిల పరామర్శ
1లక్ష 50వేల ఆర్థిక సహాయం
హైదరాబాద్ జూన్ 22 (ప్రజాక్షేత్రం): నాగర్ కర్నూల్ జిల్లా మొలచింతలపల్లి గ్రామంలో జరిగిన పాశవిక ఘటనలో గాయపడిన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డిలు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని, సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి బీఆరెస్ పార్టీ తరుపున 1లక్ష 50వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు సబితా, సత్యవతిలు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా, అమానుష రీతిలో ఈశ్వరమ్మపై దాడి చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటీవల పెరుగుతున్న నేరాల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహారించాలని కోరారు.