కేసీఆర్‌తోనే సింగరేణి అప్పుల పాలు, సింగరేణి అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించాలి : కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్ జూన్ 22 (ప్రజాక్షేత్రం): మాజీ సీఎం కేసీఆర్ సింగరేణిని అప్పుల పాలు చేశారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సింగరేణి వ్యవస్థను బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ధ్వంసం చేశారని.. ఇప్పుడు అదే బీఆరెస్ పార్టీ నేతలు సింగరేణిపై మొసలి కన్నీరు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి రూ.30 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. బీఆరెస్ హయంలో విద్యుత్తు సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయలేదని, ఈ కారణంగా సింగరేణికి బకాయిలు పేరుకుపోయాయని కిషన్‌రెడ్డి తెలిపారు. బీఆరెస్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం బాగా పెరిగిపోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా సింగరేణిని దోచుకున్నారని నిప్పులు చెరిగారు. బీఆరెస్ అధికారంలోకి వచ్చే నాటికి సింగరేణి బ్యాంకు ఖాతాలో రూ.3500 కోట్ల మిగులు ఫండ్స్ ఉన్నాయని గుర్తు చేశారు. బీఆరెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని అప్పుల పాలు చేశారని అన్నారు. 2014కు ముందు సింగరేణిలో ఉద్యోగులకు జీతాలు అలస్యంగా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదని, బీఆరెస్ వచ్చాకా ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలు అందుతున్నాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.