Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

దళిత మహిళపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి

దళిత మహిళపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి

-కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్) డిమాండ్

 

కర్నూల్ జూన్ 23(ప్రజాక్షేత్రం): నిరుపేద దళితురాలైన గురిగింజ హనుమక్కపై విచక్షణారహితంగా దాడి చేసిన ఆధిపత్య కులాల చెందిన ఆనంద్, గొల్ల నరేంద్ర, రామలింగం, భూపాల్, లోకేష్, సోమేష్, శేఖర్ ల పై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్ ) డిమాండ్ చేసింది. దెబ్బలు తిని హాస్పిటల్లో అడ్మిట్ అయి ఆరు రోజుల నుండి చికిత్స తీసుకుంటున్న బాధితులను విచారణ చేసి ముద్దాయిలపై కేసు నమోదు చేయని ఎస్ఐ పై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

 

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రత్నపల్లె గ్రామంలో దాడికి గురై ఆరు రోజులపాటు కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొంది ప్రాణ భయంతో కూతురు వద్ద తలదాచుకుంటున్న దళిత హనుమక్కను సంఘం ప్రతినిధి బృందం పరామర్శ చేసింది. వెల్దుర్తి మండలం, రత్నపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 973/A2a లో మూడు తరాలుగా అనుభవిస్తూ వస్తున్న వంక పోరంబోకు భూమిని, అక్రమంగా లాక్కోవాలనే దురుద్దేశంతో దళితులు వేసిన పంటను అక్రమంగా నాశనం చేసి, తిరిగి జూన్ 17న అక్రమంగా పంటను ఇత్తే ప్రయత్నం చేస్తున్న ఆధిపత్య వర్గాలను అడ్డుకోబోయిన హనుమక్కపై కులం పేరుతో దూషిస్తూ మహిళ అనే కనికరం లేకుండా విచక్షణ రహితంగా దాడి చేయడంతో పాటు ఘటనను అడ్డుకోబోయిన హనుమక్క భర్త పెద్ద రాముడు, మరిది కుమారుడు రామాంజనేయులపై కూడా దాడి చేశారన్నారు.

దాడికి గురైన హనుమక్క ఆరు రోజులపాటు కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొంది, ప్రాణభయంతో గ్రామానికి వెళ్లకుండా కూతురు దగ్గర తలదాచుకుంటున్నా, ఎమ్మెల్సీ ఘటనలో సైతం వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేయకుండా సివిల్ పంచాయతీ చేసే ప్రయత్నం చెయ్యడం రాజ్యాంగ విరుద్ధమైనది. దళితుల దాడిపట్ల వివక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్న వెల్దుర్తి ఎస్ఐ పై చర్యలు తీసుకుని, దాడి చేసిన బోయిని ఆనందు, గొల్ల నరేంద్ర, రామలింగం, భూపాల్, లోకేష్, సోమేశ్, శేఖర్ లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా పై అధికారులు కలగజేసుకొని సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు .

Related posts