Praja Kshetram
తెలంగాణ

బండి సంజయ్ కేంద్రమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు

బండి సంజయ్ కేంద్రమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు

 

-విద్యార్థి, యువజన సంఘాల

-ఐక్య కార్యాచరణ సమితి సంయుక్త నాయకులు

-కరీంనగర్‌లో కార్యాలయం ముట్టడికి యత్నం

-అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్‌, పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలింపు

హైదరాబాద్‌ బ్యూరో జూన్ 23 (ప్రజాక్షేత్రం) : నీట్‌ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంపై నోరు మెదపని బండి సంజరుకి కేంద్రమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్‌ యుజిసి పరీక్షా అంశంపై స్పందించాలని విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని కోర్టు నుంచి కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి బండి సంజరు క్యాంపు ఆఫీస్‌ వరకూ ర్యాలీగా ఆఫీస్‌ ముట్టడికి తరలివెళ్లారు. మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజినీకాంత్‌తో పాటు ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ, పిడిఎస్‌యు, డివైఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బండి సంజరుకు మత రాజకీయాలపై ఉన్న శ్రద్ధ లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యంపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే పేపర్‌ లీకేజీలు, అవకతవకలు జరిగాయని, విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అవడంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి ఉద్యమం చేస్తుంటే ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ నీట్‌ పేపర్‌ లీకేజీ అంశంపై చారు పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించేలా బండి సంజరు అడగాలని డిమాండ్‌ చేశారు. పేపర్‌ లీకేజీలు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బిజెపి ప్రభుత్వానికి దేశాన్ని పరిపాలించే హక్కు లేదని అన్నారు. నీట్‌ పరీక్ష మళ్లీ నిర్వహించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు మునిగంటి అనిల్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలసాని లెనిన్‌, ఎఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారావు వెంకటేష్‌, మచ్చ రమేష్‌, అరవింద్‌, గజ్జల శ్రీకాంత్‌, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు రాణా ప్రతాప్‌, అంగడి కుమార్‌ డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు నరేష్‌, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు రేణికుంట్ల ప్రితం, మళ్లారపు ప్రశాంత్‌, గంతులు మహేష్‌, రోహిత్‌, సనత్‌ రెడ్డి, రంజిత్‌ తదితరులు పాల్గన్నారు.

Related posts