కల్తీ మద్యంతో దళితులు మరణిస్తుంటే నోరు మెదపని రాహుల్ గాంధీ : నిర్మలా సీతారామన్
తమిళనాడు జూన్ 23 (ప్రజాక్షేత్రం): తమిళనాడు కల్తీ సారా ఘటనలో 50 మందికిపైగా మరణించిన ఘటనపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. కళ్లకురుచిలో జరిగిన ఈ ఘటనలో 200 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరి పరిస్ధితి విషమంగా ఉందని అన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 56 మంది మరణించారని, వీరిలో అధికులు షెడ్యూల్డ్ కులాల వారే అని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె తెలిపారు. కల్తీ సారా ఘటనపై కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వం నిర్వహించే షాపుల్లో కళ్లకురుచిలో బాహాటంగా కల్తీ మద్యం, నాటు సారా విక్రయిస్తుంటే డీఎంకే సర్కార్‌కు మద్దతిస్తున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ఆమె నిలదీశారు. కల్తీ మద్యంతో దళితులు మరణిస్తుంటే రాహుల్ గాంధీ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.