Praja Kshetram
జాతీయం

బిహార్ వంతెనలకేమైంది? వారంలో మూడో ఘటన

బిహార్ వంతెనలకేమైంది? వారంలో మూడో ఘటన

 

పట్నా జూన్ 23 (ప్రజాక్షేత్రం): బిహార్‌లో వరుసగా వంతెనలు కుప్పకూలుతుండటం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా తూర్పు చంపారన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న చిన్న వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు. మోతీహరిలోని ఘోరసహన్ బ్లాక్‌లో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అమ్వా గ్రామాన్ని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడానికి రాష్ట్ర గ్రామీణ పనుల విభాగం
(ఆర్ డబ్ల్యూ డి) కాలువపై రూ.1.5 కోట్ల అంచనా వ్యయంతో 16 మీటర్ల పొడవైన వంతెనను నిర్మిస్తోంది. ఇది ఆదివారం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని (ఆర్ డబ్ల్యూ డి) అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్ తెలిపారు. వారంలో వంతెన కుప్పకూలిన ఘటన మూడోది కావడం గమనార్హం.

*నిధులు నేలపాలు..*

సివాన్ జిల్లాలో శనివారం చిన్న వంతెన కూలిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 45 ఏళ్ల క్రితం గండక్ కెనాల్‌పై నిర్మించిన ఈ వంతెన కుప్పకూలింది. అయితే వంతెన కూలిన శబ్దాలు.. పొరుగునే ఉన్న ధర్బంగా జిల్లాలోని రామ్‌ఘర్ వరకు వినిపించాయని స్థానికులు వెల్లడించారు. మహరాజ్‌గంజ్‌లోని పతేది బజార్‌ను ధర్బంగా జిల్లాలోని రామ్‌ఘర్ పంచాయితీలను ఈ వంతెన కలుపుతుందని వారు తెలిపారు. ఈ వంతెనపై నిత్యం వేలాది మంది ప్రజలు ప్రయాణిస్తారని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. జూన్ 18వ తేదీన అరారియా జిల్లాలో కుర్సాకాంతా, సిక్తి మధ్య బాక్రా నదిపై నిర్మిస్తున్న వంతెన కుప్ప కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ వంతెన నిర్మాణానికి వినియోగించిన దాదాపు రూ.12 కోట్లు నేలపాలైయ్యాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ వంతెన కూలిపోయిన ఘటనలో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఏడాది మొదట్లో ఇదే రాష్ట్రంలోని సుపౌల్‌లో కోసి నదిపై రూ. 984 కోట్లతో నిర్మిస్తున్న వంతెన స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా వంతెనలు కుప్పకూలుతుండటం చర్చనీయాంశం అవుతోంది.

Related posts