త్వరలో మంత్రివర్గ విస్తరణ! కొత్తగా ఆరుగురికి అవకాశం
*-రెడ్లు, బీసీల నుంచి ఇద్దరేసి*
*-మంత్రివర్గంలోకి మరో ఎస్టీ, ఎస్సీ*
*-పోచారం శ్రీనివాస్‌రెడ్డికీ అవకాశం!*
*-నామినేటెడ్ పోస్టుల్లో మార్పులు?*
*-నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి*
*-అజెండాలో విస్తరణ, పీసీసీ చీఫ్ భర్తీ*
*-అధిష్ఠానంతో కీలక చర్చలు*
*-చేరికలపై కూడా మంతనాలు*
హైదరాబాద్ జూన్ 23 (ప్రజాక్షేత్రం):త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. దీనికి జులై 2 ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియడంతో సీఎం రేవంత్ మంత్రివర్గ విస్తరణపై దృష్టిసారించారని పార్టీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ప్రకటించిన 37 నామినేటెడ్ పోస్టుల భర్తీపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధిష్ఠానం సూచన మేరకు వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫైనల్ చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి మంత్రివర్గంలో 6 గురికి చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. వారిలో ఇద్దరు రెడ్డి, ఇద్దరు బీసీ, ఒక్కరు ఎస్టీ చోటు దక్కనున్నదని సమాచారం. మరొకటి మైనారిటీ కి ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నా.. మైనార్టీ ఎమ్మెల్యే ఒక్కరూ కూడా
లేకపోవడంతో ఆ స్థానాన్ని ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి దక్కనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ దగ్గరే హోం, విద్య, మున్సిపల్, కార్మిక శాఖలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నాలుగు శాఖలు కొత్తగా మంత్రివర్గంలో తీసుకునే వారికి కేటాయించే అవకాశం ఉన్నదని అంటున్నారు. మంత్రివర్గలో చోటు దక్కించుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి విలేకరుల సమావేశంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు తనకు సమాచారం ఉన్నదన్నారు.
దీంతో బీసీ సామాజికవర్గ కోటాలో ఆయన బెర్త్ ఖాయమైనట్టేనని చెబుతున్నారు. మంత్రిగా మరో బీసీకి అవకాశం దక్కనుండటంతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి బోధన్ ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్‌నేత పీ సుదర్శన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టే అని సమాచారం. అలాగే హోం శాఖ బాధ్యతలు ఆయనకే అప్పగిస్తారని టాక్ వినిపిస్తున్నది. అయితే ఇటీవల బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరారు. ఆయన సేవలను ఉపయోగించుకుంటామని, ఆయనకు ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ ఇద్దరిలో చివరికి ఎవరికి దక్కుతుందో అన్న వాదనలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్నది. ఇదే సమయంలో పరిగి ఎమ్మెల్యే రాం మోహన్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్‌కు అవకాశం ఇస్తారని అంటున్నారు. మరొకటి మైనారిటీలు ఇవ్వాలనుకుంటున్నా పార్టీ తరఫున ఎవరూ లేకపోవడంతో ఎస్సీ సామాజికవర్గానికికి దక్కవచ్చని చెబుతున్నారు. అయితే దీనికోసం పోటీ తీవ్రంగానే ఉన్నది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రిపదవిని ఆశిస్తున్నారు. మాదిగ సామాజికవర్గానికి కాంగ్రెస్ పార్టీ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు ఇవ్వకపోవడంపై వివాదం చెలరేగింది. మోత్కుపల్లి లాంటి ఇప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికైనా తమ సామాజికవర్గానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. దీంతో ఎస్సీ కోటాలో ఎవరికి ఆ అవకాశం దక్కుతుంది అన్నది వేచి చూడాలి. అంతేకాదు బీఆర్‌ఎస్ నుంచి 20 ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారని ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అలా పెద్దమొత్తం బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వస్తారా? దీనిపై ఎవరితోనైనా సంప్రదింపులు చేశారా? వారికి ఏమైనా హామీ ఇచ్చారా? అన్నది తేలాల్సి ఉన్నది. ఒకవేళ అదే జరిగితే మంత్రివర్గంలో ఇప్పడు ప్రచారం జరుగుతున్న పేర్లలో మార్పులు చేర్పులు ఉండొచ్చు అంటున్నారు.