ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్
పరిగి జూన్ 23 (ప్రజాక్షేత్రం): ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ, ఆదివారం పరిగిలోని సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్‌లో జరిగిన సభలో రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు ఇస్తే, రాష్ట్రంలో ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ అమలు చేసిందని తెలిపారు. త్వరలోనే రైతు భరోసా కింద ఎకరాలకు రూ.7500ల నగదు సాయం అందించనున్నట్లు తెలిపారు. ఏడాదిలో రెండు దఫాలుగా ఇచ్చే రైతు భరోసాపై విధివిధానాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. పూడూరులో రూ.2500కోట్లతో నేవీరాడార్ స్టేషన్‌ల పనుల ప్రారంభానికి త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దాంతి పార్థసారథి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్, పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ, డీసీసీ కార్యదర్శి ఎన్.రామకృష్ణ, నాయకులు అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.