కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
*-కళ్లల్లో కారంపొడి చల్లి కర్రలతో దాడి*
*-జేసీబీతో డంపింగ్ యార్డులో మృతదేహం పూడ్చివేత*
*-నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*
*-నిందితుల ఇళ్లపై బాధితుల రాళ్ల దాడి*
మేడ్చల్ జిల్లా జూన్ 25 (ప్రజాక్షేత్రం): ఘట్కేసర్లో ఈ నెల 15న అదృశ్యమైన కాంగ్రెస్ నేత, ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ (45) హత్యకు గురయ్యాడు. ప్లాటు వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ ఆస్తిని కాజేయాలని ప్రయతిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకొని మహేశు దారుణంగా హత్య చేసి డంపింగ్ యార్డులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన వివరాలను సీఐ సైదులు సోమవారం వెల్లడించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేడ్కర్నగర్కు చెందిన గడ్డం మహేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్,(36), కడుపొల్ల ప్రవీణ్(27)తో ప్లాటు విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శ్రీనివాసైపై మహేశ్ క్రిమినల్ కేసు పెట్టాడు. దీంతో అతడిని చంపాలని ప్రవీణ్ను శ్రీనివాస్ సంప్రదించాడు. మహేశ్ తమ బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్ ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో ఇరువురు కలిసి మహేశ్ను చంపాలని నిర్ణయించుకున్నారు.
*రాజీ చేసుకుందామని పిలిచి అంతమొందించారు….*
ఘట్కేసర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల మహేశ్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఈ నెల 14 రాత్రి రాజీ చేసుకుందామని చెప్పి ఆఫీసుకు రావాలని కోరారు. అందుబాటులో లేనని మహేశ్ చెప్పడంతో తిరిగి 15న ఉదయం రావాలని కోరారు. మహేశ్ తన ఆఫీసుకు చేరుకోగానే కళ్లల్లో కారం పొడి చల్లి, కర్రలతో దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆఫీస్ షెటర్ మూసి వెళ్లిపోయారు. రాత్రివేళ మహేశ్ కారులోనే అతడి శవాన్ని శ్రీరాములు, రాజు అనే వ్యక్తుల సాయంతో కొండాపూర్ డంపింగ్ యార్డుకు తరలించి జేసీబీతో పూడ్చిపెట్టారు.