Praja Kshetram
తెలంగాణ

‘నాతో కోపరేట్‌ చేస్తే కేసును పరిష్కరిస్తా’.. ఓ మహిళకు శాలిగౌరారం ఎస్సై లైంగిక వేధింపులు

‘నాతో కోపరేట్‌ చేస్తే కేసును పరిష్కరిస్తా’.. ఓ మహిళకు శాలిగౌరారం ఎస్సై లైంగిక వేధింపులు

 

 

నల్లగొండ జూన్ 26 (ప్రజాక్షేత్రం): ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులలో కొందరు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తూ మొత్తం పోలీస్‌ వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొస్తున్నారు. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ నిర్వాకాన్ని మరువకముందే మరో ఎస్సై కీచక బాగోతం బయటపడింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎస్సై వాస ప్రవీణ్ కుమార్‌‌.. ఓ కేసు విషయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళను లైంగికంగా వేధించాడు. తనకు కోపరేట్‌ చేస్తే కేసును పరిష్కరిస్తానని అసభ్యంగా మాట్లాడాడు. సదరు మహిళ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ భూవివాదంలో న్యాయం కోసం మండలానికి చెందిన ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. భూవివాదంపై జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై వేధింపులకు గురిచేశాడు.
ఆమె భర్తతో దూరంగా ఉంటుందని తెలుసుకున్న ఎస్సై ప్రవీణ్‌.. ‘భర్తతో ఎందుకు దూరంగా ఉంటున్నావ్.. అతనితో ఉండటం ఇష్టం లేదా..?’ అని ప్రశ్నించాడు. తనకు సహకరిస్తే కేసును పరిష్కరిస్తానని మాటిచ్చాడు. తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, తన కోసం చేపల కూర, చికెన్ వండుకుని తేవాలని, గ్రీన్ టీ చేసి పెట్టాలని గొంతెమ్మ కోరికలు కోరాడు. రెండు గంటలపాటు తన చాంబర్‌లో కూర్చోబెట్టుకుని అసభ్యకర మాటలతో విసిగించాడు. ‘కేసును పరిష్కరించాలంటే నేను చెప్పినట్లు చేయాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలి. నాకు కావాల్సినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి. భర్తకు దూరంగా ఎందుకు ఉంటున్నావ్..? అతనితో ఉండాలన్న కోరిక లేదా..?’ అని ఎస్సై తనను వేధించాడని బాధిత మహిళ ఎస్పీకి మొరపెట్టుకున్నారు. తనతో బాగుంటే పూర్తి సహకారం ఉంటుందని అన్నాడని ఆమె విలపించారు. అతని మాట వినకపోవడంతో కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని, గొడవలు సృష్టిస్తున్నాడని తెలిపారు.

Related posts