ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
ఢిల్లీ జూన్ 27 (ప్రజాక్షేత్రం): లోక్‌సభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. 18వ లోక్‌సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి ప్రసంగిస్తున్నారు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకరాం చేసిన సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల విశ్వాసాన్ని గెలిచి సభకు ఎన్నికయ్యారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మన దేశ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్దవి. సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈసీకి అభినందనలు. సభ్యులంతా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచమంతా భారత ఎన్నికలను నిశితంగా పరిశీలించింది. ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసించి మళ్లీ పట్టం కట్టారు. ప్రభుత్వ సుస్థిరత, నిజాయితీని నమ్మారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అయ్యింది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది’ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరించారు.