దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీపై రాష్ట్రపతి మౌనం : ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్
ఢిల్లీ జూన్ 27 (ప్రజాక్షేత్రం): రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ గురించిన ప్రస్తావన తీసుకురావడం మంచిదే అని కానీ దేశంలో ఇవాళ నెలకొన్న అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించలేదని ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. మనం ప్రాధమిక అంశాల గురించి మాట్లాడనప్పుడు పురోగతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నదని, ఉపాధి అవకాశాలు లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలు, దళితుల అణిచివేత వంటి ఎన్నో సమస్యలున్నాయని వీటిపై రాష్ట్రపతి మాట్లాడతారని తాము భావించినా వాటి ప్రస్తావన లేదని అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలన్నింటిపై తాము మాట్లాడతామని, ప్రజల ముందు చర్చిస్తామని చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు.