ఉపాధ్యాయులను నియమించండి.. మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు
మెదక్ జూన్ 28 (ప్రజాక్షేత్రం): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం పరిధిలోని శాలిపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా కొత్తగా ఉపాధ్యాయులను నియమించండంటూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డుపైనే వంటావార్పు చేస్తూ నిరసనలు తెలిపారు. ఉపాధ్యాయులను నియమించే వరకు రోడ్డుపైనే తమ నిరసన కొనసాగుతుందని విద్యార్థులు తేల్చిచెప్పారు. శాలిపేట ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఇద్దరు మాత్రమే స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. అయితే విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరని వెంటనే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని తమకు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు విద్యాబోధన సక్రమంగా కొనసాగేటట్టు చూడాలని వారి తల్లిదండ్రులు కోరారు. గవలపల్లి – రామాయంపేట రోడ్డుపై విద్యార్థులు బైఠాయించారు. టీచర్లు కావాలని ప్లకార్డులు ప్రదర్శించి నిరసనలు తెలిపారు.