పర్యాటక అభివృద్ధికి రూ. 110 కోట్లు.
*-స్వచ్ఛ దర్శన్ పథకం నిధులు మంజూరు.*
*-స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.*
వికారాబాద్, జూన్ 29(ప్రజాక్షేత్రం): జిల్లాలో పర్యాటక అభివృద్ధికి స్వచ్ఛదర్శన్ పథకం కింద రూ. 110 కోట్లు మంజూరు అయ్యాయని, ఇట్టి నిధులతో 213 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు ప్రణాళికల రూపొందించారని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని స్టేట్ ఛాంబర్‌లో అనంతగిరి పర్యాటక అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై అటవీ, దేవాదాయ, మిషన్‌భగీరథ, భూగర్భజలాల, మున్సిపల్ విభాగాల అధికారులతో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌లతో కలిసి స్పీకర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులతో పేదలకు ఉపాధి కలిగేలా ఉండాలని, అదేవిధంగా ఆదాయ వనరులపై నివేదిక రూపొందించాలని సూచించారు. గతంలోనే పర్యాటక అభివృద్ధికి 225 కోట్లు మంజూరైనప్పటికీ రూ.25 కోట్లతోనే అభివృద్ధి పనులు చేశారని ఆయన తెలిపారు. పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చొరవతో కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటుతో పర్యాటకుల రద్దీ పెరిగిందని, స్థానికులకు ఉపాధిదొరికిందని గుర్తు చేశారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పర్యాటక ప్రాంత అభివృద్ధిలో భాగంగా స్థానికులకు పూర్తిస్థాయిలో ఉపాధి అవకాశాలు ఉండాలన్నారు. జిల్లాలోని అనంతగిరి ప్రాంత అభివృద్ధితో పాటు కోట్‌పల్లి, సర్పన్‌పల్లి, శివసాగర్, లక్నాపూర్ ప్రాజెక్టులు, దామగుండం ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. పర్యావరణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా చేపట్టే వివిధ పనులను ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ మేనేజర్ సుమతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ జిల్లా అధికారి రేణుక, ఈఈ సుందర్, డీఎ్‌ఫవో జ్ఞానేశ్వర్, డీవైఎ్‌సవో హనుమంతరావు, మత్స శాఖ అధికారి సౌజన్య, దేవాదాయశాఖ అధికారి నరేందర్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ పాల్గొన్నారు.