Praja Kshetram
తెలంగాణ

తెలంగాణ ఉద్య‌మ గాయ‌కుడు సాయిచంద్ ప్ర‌థ‌మ వ‌ర్ధంతి.. ఘ‌న నివాళుల‌ర్పించిన కేటీఆర్

తెలంగాణ ఉద్య‌మ గాయ‌కుడు సాయిచంద్ ప్ర‌థ‌మ వ‌ర్ధంతి.. ఘ‌న నివాళుల‌ర్పించిన కేటీఆర్

 

 

 

హైద‌రాబాద్ జూన్ 29(ప్రజాక్షేత్రం): తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ‌వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సాయిచంద్‌కు కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్య‌మానికి, బీఆర్ఎస్ పార్టీకి అందించిన సేవ‌ల‌ను నాయ‌కులు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ మలివిడత ఉద్యమంలో ఆటాపాటా తీసుకొచ్చిన చైతన్యం అంతాఇంతా కాదు. పాట లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదు. అయితే ఆ ఉద్యమానికే గొంతుకగా నిలిచిందో స్వరం. తెలంగాణ పల్లెలను ఏకం చేసి ఉద్యమం వైపు మళ్లించిన ‘ధూం ధాం’లో గర్జించిందీ ఆ స్వరమే. పదునైన ఆ కంఠం ఓ ఉప్పెనగా మారి పరమశివున్నే ప్రశ్నించింది. గజ్జె కట్టి ఆడిపాడి.. ఢిల్లీ పీఠాన్నే కదిలించింది. ఆ స్వరం ఎవరిదో కాదు, మలి దశ ఉద్యమంలో నాలుగున్నర కోట్ల ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించిన సాయిచంద్‌ది. విద్యార్థి ఉద్యమమైనా, సామాజిక చైతన్య వేదిక అయినా, మలి దశ ఉద్యమమైనా.. వేదిక ఏదైనా సరే పాటే సాయిచంద్‌ ఆయుధం. ఆయన పాటందుకుంటే ప్రత్యర్థుల గుండెల్లో ప్రశ్నల సునామీ పుట్టేది. ‘మేం చెప్పులు కుట్టనిదే మీ కాలు బయటకెళ్లదు.. మా డప్పులు లేనిది మీ శవం కాటికెళ్లదు.. ఎవ్వడు జెప్పిండుర మేం తక్కువ జాతోల్లం అని’ అంటూ సమాజంలో జరుగుతున్న దురాచారాలపై ఆయుధం ఎక్కుపెట్టిన సాయిచంద్‌ సామాజిక చైతన్యాన్ని రగిలించారు. అంతేకాదు, ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలవదురా’ అంటూ నాడు ఉద్యమంలో ఆయన పాడిన పాట యావత్‌ తెలంగాణను ఉద్యమం దిశగా నడిపించింది. నాడు ఉద్యమ రథసారథి కేసీఆర్‌ ఎక్కడికెళ్లినా అక్కడికి సాయిచంద్‌ వెళ్లేవారు. ధూం ధాంలో కాలికి గజ్జె కట్టి ఆడిపాడే సాయిచంద్‌ అందరిలో తన ఆటపాటతో ఉద్యమ కాంక్షను రగిలించేవారు. అతడు పాట పాడితే సబ్బండవర్గాలు లయబద్ధంగా ఆడేవి. అతడు గజ్జె కట్టి ఆడితే ముల్లోకాలు ఊగేవి. అతడి గొంతులో అంతటి మాధుర్యం ఉండేది. అతని ఆటలో ఎంతటి మహత్తు ఉందో తెలియదు కానీ, ఊరూవాడా సయ్యాటలాడేవి. ధూం ధాం, అలయ్‌ బలయ్‌.. వేదిక ఏదైనా ఉండనీ, అక్కడ సాయిచంద్‌ ఉండాల్సిందే. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తనదైన శైలిలో పాట ద్వారా ప్రజలకు చాటిచెప్పిన సాయిచంద్‌.. తెలంగాణ ఎందుకు రావాలో ఘంటాపథంగా వివరించేవారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నాటి ఉద్యమానికి పాటలతో ఊపిరులూదారు. తెలంగాణ సమాజాన్ని జాగృతపరిచారు. మహోన్నతమైన బాధ్యతను తలకెత్తుకొని గానమై గర్జించారు.

Related posts