అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి.. మన్ కీ బాత్ ద్వారా ప్రధాని పిలుపు.
ఢిల్లీ జూన్ 30(ప్రజాక్షేత్రం): ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ జరిపే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఇవాళ పునఃప్రారంభించారు. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక జరిగిన తొలి మన్ కీ బాత్ ఇదే. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటాలని పిలుపునిచ్చారు. తద్వారా తల్లిలాంటి ప్రకృతిని కాపాడుకున్నవారిమౌతాం అని వివరించారు. ఎన్డీఏకి మూడో సారి అధికార పగ్గాలు అప్పగించినందుకు మోదీ.. దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
*అరకు కాఫీ రుచులను గుర్తు చేసుకున్న మోదీ..*
మన్ కీ బాత్ ప్రసంగం సందర్భంగా అరకు కాఫీ రుచులను వివరిస్తూ ప్రధాని మోదీ కొన్ని ఫొటోలు ఎక్స్‌లో షేర్ చేశారు. ఏపీ స్పెషల్ కాఫీ గురించి ఆయన ప్రస్తావించారు. అరకు ఏజెన్సీలో పండించే కాఫీ గురించి మోదీ దేశ ప్రజలకు వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని అధిక మొత్తంలో పండిస్తారని తెలిపారు. ఈ కాఫీ అద్భుతమైన రుచి, సువాసనకు ప్రసిద్ధి చెందిందని కొనియాడారు. స్థానిక ఉత్పత్తులు ప్రజాదారణ పొందాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2016 లో చంద్రబాబు తో కలిసి కాఫీ తాగిన ఫొటోను మోదీ ఎక్స్‌లో షేర్ చేశారు.